నాంపల్లి : ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు కురిసే పరిస్థితులు లేనందున భూగర్భ జలాలు కాపాడుకుందామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) శేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం నాంపల్లి మండలం దేవత్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వీబీజీ రామ్ జీ పనులను పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామంలో రైతులకు కూలీలకు పనులు కల్పించాలన్నారు. దసరా తర్వాత ప్రతి గ్రామ పంచాయతీలో 50 మంది కూలీలకు పనులు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శర్మ, సర్పంచ్ ముదిగొండ ఏసు, ఏపీఓ గుంటుక వెంకటేశం, ఎంపీఓ మధు, పంచాయతీ కార్యదర్శి పెద్దలు, ఉప సర్పంచ్ జక్కుల సత్యనారాయణ పాల్గొన్నారు.
తగ్గిన నీటి లీకేజీ
నిడమనూరు : సాగర్ ఎడమ కాల్వపై 31.1 కిలోమీటర్ వద్ద గల నర్సింహాలగూడెం మేజర్ నుంచి నీటి లీకేజీ తగ్గింది. దీంతో ఎన్నెస్పీ అధికారులు ఎడమ కాల్వకు నీటి విడుదలను పెంచారు. గురువారం సాగర్ ఎడమ కాల్వలో 6 వేల క్యూసెక్కులకుపైగా నీటి ప్రవాహం కొనసాగింది. నర్సింహాలగూడెం మేజర్ వద్ద స్లూయీస్లో నీటి లీకేజీ కారణంగా రెండు రోజులుగా కాల్వకు నీటి విడుదలను తగ్గించారు. రెండు రోజులుగా మట్టి, గడ్డి కట్టలు, ఇసుక బస్తాలతో మరమ్మతులు చేపట్టామని, నీటి లీకేజీ తగ్గిందని, కాల్వ కట్టకు ఎలాంటి ప్రమాదం లేదని ఎన్నెస్పీ అధికారు చెబుతున్నారు. మేజర్ వద్ద సిబ్బందితో భద్రతను కూ డా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రో జూ ఒక ఏఈ, ఇద్దరు ఎన్నెస్పీ సిబ్బంది తూమును పర్యవేక్షిస్తారని అధికారులు చెప్పారు.
అర్హులు ఓటు నమోదు చేయించుకోవాలి
నల్లగొండ టూటౌన్ : అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా పేరు నమోదు చేయించుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి కోరారు. గురువారం నల్లగొండ పట్టణంలో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన పలువురు వైద్యులు, న్యాయవాదులు, ఉద్యోగులను కలిసి మాట్లాడారు. పట్టభద్రుల సమస్యలను చట్టసభల్లో గళమెత్తి వినిపించే సరైన ప్రతినిధిని ఎన్నుకోవడంలో ప్రతి ఓటు ఎంతో కీలకమైనదన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్యా సంబంధిత అంశాలు, నిరుద్యోగం, ఉద్యోగుల సమస్యలపై బలంగా గొంతు విప్పే ప్రాతినిధ్యం కోసం పట్టభద్రులు తమ ఓటు హక్కును పొంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


