రూపకల్పన ఇలా..
నల్లగొండ టూటౌన్: పౌర సేవలు, ప్రజా సమస్యల పరిష్కారానికి గాను నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. పౌరసేవలు, సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదులు అందించేందుకు ఇక నుంచి కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరగాల్సినం పనిలేదు. ఇంటి దగ్గరి నుంచే అన్ని పౌర సేవలు పొందేలా నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏఐ సాంకేతికతతో వాట్సప్ చాట్‌బాట్‌ను రూపొందిస్తోంది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాలతో ఈ వాట్సప్ చాట్‌బాట్ పురుడు పోసుకుంటోంది. ప్రస్తుతం దీన్ని ఎలా వినియోగించాలనే అని దానిపై లోతుగా పరిశీలిస్తున్నారు.
సమస్యకు తక్షణ పరిష్కారం
నగరంలోని 48 డివిజన్ల పరిధిలోని కాలనీల్లో ఏదైన సమస్య నెలకొంటే దానిని వాట్సప్ చాట్ బాట్‌కు పంపించవచ్చు. ఈ సమాచారం పంపించడానికి మున్సిపల్ కార్పొరేషన్ త్వరలోనే ఒక వాట్సప్ నంబర్ నగర ప్రజలకు అందుబాటులోకి తేనుంది. డ్రెయినేజీ పూడిక, మురుగుతో దుర్వాసన, వీధిదీపాల సమస్య, రోడ్డు గుంతలుగా ఉండడం, తాగునీరు, చెత్త వాహనం రాకపోవడం వంటి సమస్యలు మున్సిపల్ కార్పొరేషన్‌కు వాట్సప్ చాట్‌బాట్‌కు తెలపొచ్చు. అయితే సమస్యకు సంబంధించిన ఒక ఫొటో, వార్డు నంబర్, లొకేషన్‌ను ఈ వాట్సప్ చాట్‌బాట్‌కు పంపించాల్సి ఉంటుంది. ఇది వార్డు ఆఫీసర్‌కు, సంబంధిత విభాగం హెడ్‌కు వెళుతుంది. ఈ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా అని కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఆన్లైన్లో పర్యవేక్షిస్తారు.
హాయ్.. ఏఐ చాట్‌బాట్‌కు స్వాగతం
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ వాట్సప్ చాట్‌బాట్ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపించగానే నమస్కారం! నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అధికారిక ఏఐ చాట్‌బాట్‌కు స్వాగతం అని తెలుగులో, ఇంగ్లిష్‌లో కూడా వస్తుంది. ఇది 24/7 సర్వీస్ అందుబాటులో ఉంటుందని చెబుతుంది. ఇక్కడనే దయచేసి మీ భాషను ఎంచుకోండి అని వస్తుంది. ఇక్కడ భాషను ఎంచుకొని సెండ్ చేయగానే సేవ ఎంచుకోండి అని మెసేజ్ వస్తుంది. సేవ మీద క్లిక్ చేయగానే ఫిర్యాదు నమోదు, నా ఫిర్యాదులు, వార్డు సమాచారం గురించి వస్తుంది. ఇక్కడ తమకు అవసరమైన దానిని ఎంచుకొని సెండ్ చేయగానే వరుసక్రమంలో వివిధ సమస్యల గురించి అడుగుతుంది. దానిలో మనకు ఎదురైన సమస్యను ఎంచుకొని వాట్సప్‌లోనే సెండ్ చేయాల్సి ఉంటుంది.
మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలతో నగర ప్రజలకు సులభతరమైన సేవలు అందించడం కోసమే ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వాట్సప్ చాట్‌బాట్ రూపొందిస్తున్నాం. ప్రజలు కార్పొరేషన్ కార్యాలయానికి రాకుండానే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, నగర మేయర్
వార్డుల్లో సమస్యల పరిష్కారానికి కొత్త విధానం
ఫ కార్యాలయానికి వెళ్లకుండానే వాట్సప్‌లో ఫిర్యాదులకు అవకాశం
ఫ మంత్రి కోమటిరెడ్డి ఆదేశంతో రూపొందిస్తున్న కార్పొరేషన్
ఫ త్వరలోనే అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు
నగరంలో 48 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ వార్డుకు సంబంధించిన వార్డు అధికారి పేరు, ఫోన్ నంబర్, జవాన్ పేరు, ఫోన్ నంబర్, కార్పొరేటర్ పేరు కూడా వస్తుంది. అదేవిధంగా మన సమస్యను వాట్సప్‌లో వాయిస్ రూపంలో, లేదా చాటింగ్ ద్వారా కూడా పంపే విధంగా రూపొందించారు.


