రూ.5.14 లక్షలు
పలికిన లడ్డూ వేలం
ఫ జిల్లాలో ప్రశాంతంగా నిమజ్జనం
ఫ తీన్మార్ స్టెప్పులతో అలరించిన యువత
ఫ అర్ధరాత్రి వరకు కొనసాగిన వేడుకలు
నల్లగొండలోని క్లాక్‌టవర్ సెంటర్ గుండా సాగుతున్న గణేశ్ శోభాయాత్ర
నల్లగొండ: నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడి నిమజ్జన వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా కనుల పండువగా జరిగాయి. అంతటా గణేష్ శోభాయాత్ర శోభాయమానంగా కొనసాగింది. వేలాది మంది భక్తులు, యువకులు, మహిళలు, చిన్నారుల జయజయధ్వానాలు, గణపతి బప్పా మోరియా నినాదాలు, నృత్యాలు, డప్పు వాయిద్యాలు, తీన్మార్ స్టెప్పుల నడుమ బొజ్జ గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో గణేశుడి శో భాయాత్ర ఆధ్యాత్మికకోలాహలంగా కొనసాగింది.
పాతబస్తీలో కలెక్టర్, ఎస్పీ తొలిపూజతో
శోభాయాత్ర ప్రారంభం
శోభాయాత్ర ప్రారంభం సందర్భంగా నల్లగొండలోని పాతబస్తీలోని మూడో నంబర్ వినాయకుడి వద్ద, హనుమాన్ నగర్‌లోని ఒకటో నంబర్ వినాయక విగ్రహాల వద్ద కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తొలి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. అధికారులు స్వయంగా పాల్గొని పూజలు చేయడం భక్తుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు మేయర్, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. శాంతి, గణేష్ ఉత్సవ కమిటీల భాగస్వామ్యంతో శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
నిమజ్జన ప్రదేశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
జిల్లావ్యాప్తంగా దాదాపు 8 వేలకుపైగా విగ్రహాలను ప్రతిష్ఠించగా ఇందులో కేవలం నల్లగొండ పట్టణంలో 568 విగ్రహాలు ఉన్నాయి. ఐదు రోజులుగా దాదాపు 6 వేలు విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. వచ్చే మూడు రోజుల్లో మరో 2 వేలు విగ్రహాల నిమజ్జనం పూర్తికానుందని అధికారులు తెలిపారు. నల్లగొండలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిమజ్జన ప్రదేశాల్లో బారికేడ్లు, రాత్రి వేళల్లో లైటింగ్, క్రేన్లు, తాగునీరు, షామియానాలను ఏర్పాటు చేశారు. 10 అడుగుల లోపు విగ్రహాలు అర్జాలబావిలోని వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనం చేసేలా క్రేన్లు సిద్ధం చేశారు. 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భారీ విగ్రహాలు సాగర్ ఎడమకాల్వ 14వ మైలు వద్ద నిమజ్జనం చేసేలా మార్గాలను నిర్దేశించారు. 14వ మైలురాయి వద్ద తగినంత నీరు ఉండడంతో నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా కూడా నిమజ్జన ప్రదేశాల్లో వైద్య, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.
పోలీసుల భారీ బందోబస్తు
ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షణలో నల్లగొండ పట్టణంతోపాటు జిల్లా అంతటా భారీ బందోబస్తు నిర్వహించారు. బుధవారం ఒక్కరోజే జిల్లాలోని 8 ప్రధాన నిమజ్జన ప్రదేశాల్లో దాదాపు 2 వేల విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని భావించి ట్రాఫిక్ మళ్లింపు, రూట్ డైవర్షన్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, అదనపు ఎస్పీ రమేష్, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, భక్తులు, యువత, చిన్నారులు పాల్గొన్నారు.
నల్లగొండలోని పాతబస్తీలో ఒకటో నంబర్ వినాయక మండపం వద్ద నిర్వహించిన లడ్డూ వేలం పాట భక్తుల తీవ్ర పోటీ నడుమ ఉత్సాహభరితంగా సాగింది. ఈ వేలంలో పర్వతం అశోక్ లడ్డూను అత్యధికంగా రూ.5.14 లక్షలకు పాటపాడి దక్కించుకున్నాడు. భక్తులు పోటాపోటీగా పాల్గొనడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.


