హాలియా (నాగార్జునసాగర్): వినాయక నిమజ్జనం కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. బుధవారం సాయంత్రానికి 14 మైలు వరకు నీరు చేరేందుకు గాను మధ్యాహ్నం 2,765 క్యూసెక్కుల నీటిని వదిలారు. మూడు వేల క్యూసెక్కుల మేరకు నీటిని విడుదల చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. సాగర్ జలాశయం నీటిమట్టం గరిష్టంగా 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 535.80 అడుగులు (179.6902టీఎంసీలు)గా ఉంది. కుడి కాల్వకు నీటిని నిలిపివేశారు. ఎస్సెల్బీసీకి 2,000 క్యూసెక్కులు, వరద కాల్వకు 300 క్యూసెక్కులతో కలిపి మొత్తం 5,065 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. అంతే నీరు ఎగువ నుంచి వచ్చి జలాశయంలో చేరుతుందని అధికారులు తెలిపారు.
వ్యవసాయ వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు
నకిరేకల్ : వ్యవసాయ వ్యర్థాలతో సేంద్రియ ఎరువులను తయారు చేసుకుని వాటిని పంటలకు వినియోగించుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాదించవచ్చని నాబార్డు డీడీఎం వెంకటేశ్వర్లు అన్నారు. నకిరేకల్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో వర్మి కంపోస్ట్ సొల్యూషన్, అగ్రి హబ్ సౌజన్యంతో వ్యవసాయ వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీపై బుధవారం నకిరేకల్ మండలం నెల్లిబండలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు ఐఆర్‌డీఎస్ అధ్యక్షుడు వాడపల్లి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఏడీఏ విజేయందర్‌రెడ్డి, నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజన్ వినయ్‌కుమార్, నెల్లిబండ సర్పంచి ఆడెపు రాఘవులు, ఏఈఓ ఇదాయ తుల్లా, ప్రతినిదులు భూపాల్, శ్రీనివాసులు, వాడపల్లి శ్రీనివాస్, యంపల్ల దశరథరెడ్డి, నంద్యాల అఖిల్‌రెడ్డి, ఓరుగంటి రామ్మూర్తి, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా బెజ్జం సాయి
నల్లగొండ : సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా దామరచర్ల మండలం దిలావర్‌పూర్ గ్రామ సర్పంచ్ బెజ్జం సాయి నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు పంచాయతీ రాజ్ చాంబర్స్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి నియామకపత్రం అందజేశారు. అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చింతలపూడి భాస్కర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా చాట్ల చిరంజీవి నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నియామకానికి కృషిచేసిన సత్యనారాయణరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
సేవా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధులకు సేవలు అందిస్తున్న సంస్థలు, వ్యక్తులకు సేవా పురస్కారాలకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి డి.లావణ్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో లభిస్తాయని పూర్తి చేసిన దరఖాస్తులను అదే కార్యాలయంలో అక్టోబర్ 26 వరకు సమర్పించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.wdrc.teangana.gov.in వెబ్‌సైట్ సంప్రదించాలని కోరారు.


