ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’ ఒకటి. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
మన సంస్కృతిలో పెళ్ళికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలాగే పెళ్ళయ్యాక పెళ్ళి కూతురిని అత్తగారింటికి సాగనంపేంత వరకు ఎన్నో గొప్ప సాంప్రదాయాలున్నాయి. కన్న కూతురిని ఆర్భాటంగా, ఆనందంగా ఓ అయ్య చేతిలో పెట్టి అత్తగారింటికి సాగనంపడం తరతరాలుగా వస్తున్న మన ఆనవాయితీ. కానీ అలా జరగకపోతే ఎలా ఉంటుంది అన్న ఇతివృత్తంతో తెర మీదకు తీసుకువచ్చిన ప్రయత్నమే ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. అలాగని ఇది అత్తగారింటికి అల్లుడు ఇల్లరికం వచ్చే సినిమా మాత్రం కాదు. మరీ ముఖ్యంగా నేటి తరానికి పెళ్ళి, ఆ పై కాపురానికి సంబంధించిన సరైన పాఠమే ఈ సినిమా. తమిళ యువ దర్శకుడు ఏలన్ తాను రాసుకున్న కథకు దర్శకత్వం వహించి, నిర్మించి, నటించిన సినిమా ఇది. అలాగే తెలుగు నటి మేఘన, ప్రముఖ నటి రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదో రొమాంటిక్ కామెడీ మూవీ. యువతకు కావాల్సిన అంశాలు మెండుగా ఉన్న ఈ సినిమా కథ విషయానికొస్తే... ఏలన్ అనే కుర్రాడు దుబాయ్‌లో సివిల్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అయితే తల్లిదండ్రులను వదిలి ఎక్కువ రోజులు ఉండలేక అక్కడి నుండి వచ్చేసి ఇక్కడ ఉద్యోగంతో పాటు పెళ్ళి ప్రయత్నాల్లో ఉంటాడు. అయితే అదే సమయంలో ఏలన్ అనుకోకుండా పవిత్ర అనే అమ్మాయితో ప్రేమలో పడి, పెళ్ళి దాకా తెచ్చుకుంటాడు. పైళ్ళెతే అద్భుతంగా జరుగుతుంది. పెళ్ళి కూతురుని అత్తగారింటికి సాగనంపే సమయంలోనే అసలు కథ ప్రారంభమవుతుంది. ఏలన్‌తో పైళ్ళెన తరువాత పవిత్ర తన తల్లితండ్రులను వదిలి ఉండడం ఇష్టంలేక మండపం నుండే తప్పించుకుని పరిగెడుతుంది. ఇక చేసేదేమిలేక ఏలన్ నిస్సహాయంగా పవిత్ర ఇంట్లోకి ఆర్భాటంగా అడుగుపెడతాడు. కొత్తల్లుడి సంబరం అలవాటైనంత వరకే అన్నట్టు ఏలన్ మెల్లమెల్లగా ఆ ఇంట్లో కొత్త పెళ్ళి కొడుకులా కాక కొత్త పనివాడిలా తయారవుతాడు. ఇక అక్కడి నుండి కథ అనేక మలుపులు తిరుగుతూ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది. మరి... పవిత్రను ఏలన్ తన ఇంటికి తీసుకువెళతాడా? లేదా అన్నది మాత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
– హరికృష్ణ ఇంటూరు


