నల్లగొండ టూటౌన్: కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో శనివారం నుంచి నిర్వహించనున్న రాయ్ ట్రోఫీ జూనియర్ జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు నల్లగొండకు చెందిన క్రీడాకారుడు పాలకూరి ధరన్‌తేజ ఎంపికయ్యాడు. ఈమేరకు ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బండారు ప్రసాద్, బొమ్మపాల గిరిబాబులు శుక్రవారం ధరన్‌తేజను అభినందించారు.
దరఖాస్తుల ఆహ్వానం
రామగిరి(నల్లగొండ): భారత ప్రభుత్వ తపాలా శాఖ 2026–27 సంవత్సరానికి గాను దీన్ దయాళ్ స్పర్శ యోజన ఫిలాటెలీ స్కాలర్‌షిప్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తపాలా బిళ్లల సేకరణ (ఫిలాటెలీ)ని వ్యాపకంగా కలిగి ఉండి, విద్యా రంగంలో మంచి ప్రతిభ కనబరిచే 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. ఈ పథకం కింద ఎంపికై న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ. 6 వేలు (ప్రతి త్రైమాసికానికి రూ.1,500 చొప్పున) ఆర్థిక సహాయం అందించనున్నారు. డివిజ నల్, రీజినల్, సర్కిల్ కార్యాలయాల ఆధ్వర్యంలో నిర్వహించే ఫిలాటెలీ క్విజ్, ఫిలాటెలీ ప్రాజెక్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తులను సెప్టెంబర్ 13 లోగా సమర్పించాల్సి ఉంటుంది.
పశువులు తరలిస్తున్న వాహనం పట్టివేత
భూదాన్‌పోచంపల్లి: అక్రమంగా పశువులు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకొని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామ శివారులో చోటుచేసుకొంది. ఎస్‌ఐ జగన్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా పశువులను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. గడుల లోపరాజు అనే వ్యక్తి ఏపీలోని అనకాపల్లి జిల్లా తుని సంతలో గురువారం 10 కోడె దూడలు, 3 ఆవుదూడలు మొత్తం 13 పశువులను హైదరాబాద్‌లోని బహద్దూర్‌పురకు తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. పశువులను రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం జాఫర్‌గూడలోని గోశాలకు తరలించారు. వ్యాన్ డ్రైవర్ పీసర్ల జోసెఫ్, అంగులూరి అశోక్‌లను అదుపులోకి తీసుకొని మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


