భూగర్భ జలాలు పెరుగుతాయి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎల్‌నినో నేపథ్యంలో ప్రభుత్వం నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి వర్షపు నీటి చుక్కను భూమిలోకి ఇంకేలా సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. భూగర్భ జలాల పెంపు, నీటి వృథా నివారణ, గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా జిల్లాలో ఇంటింటి ఇంకుడు గుంత, ప్రతి పొలంలో ఫామ్‌పాండ్, ప్రతి ఊరికి ఊర కుంట అనే నినాదంతో ఆరు రకాల నీటి సంరక్షణ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసేలా చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామంలో కనీసంగా ఐదు ఫామ్‌పాండ్లు, 200 ఇంకుడు గుంతలు నిర్మించడంతో పాటు అవసరమైన చోట కమ్యూనిటీ ఇంకుడు గుంతలను తవ్వించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్
ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర పెద్ద భవనాల పైకప్పులపై పడే వర్షపు నీటిని ప్రత్యేక ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపించేలా రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల వర్షపు నీరు వథా కాకుండా భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుంది.
డ్రెయినేజీల చివర ఇంకుడు గుంతలు
గ్రామాల్లోని డ్రెయినేజీ కాలువల చివరి భాగాల్లో కూడా కమ్యూనిటీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయనున్నారు. మురుగునీటిని శుద్ధి ప్రక్రియ అనంతరం భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడటంతో పాటు దోమల వ్యాప్తి తగ్గి భూగర్భ జలాలు కూడా పెరగనున్నాయి.
జలసిరితో నీటి భద్రతే లక్ష్యం
తెలంగాణ జలసిరి కార్యక్రమం ద్వారా ప్రతి వర్షపు నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవడం, భూగర్భ జలాలను పెంపొందించడం, రైతులకు సాగునీటి భద్రత కల్పించడం, గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడం వంటి బహుముఖ ప్రయోజనాలను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఫ నీటి సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ
ఫ ‘ఇంటింటికీ ఇంకుడు గుంత, పొలాలకు పంట కుంట, ఊరూరా ఊరకుంట’ నినాదం
ఫ ప్రతి గ్రామంలో ఐదు ఫామ్‌పాండ్స్, 200 ఇంకుడు గుంతలనిర్మాణమే లక్ష్యం
ఫ భూగర్భ జలాల పెంపు.. పరిశుభ్రంగా మారనున్న పల్లెలు
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి వర్షపు నీటి చుక్కను భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో నీటి లభ్యత మెరుగుపడుతుంది. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా అమలు చేస్తున్నాం. తద్వారా గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది.
– శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఓ


