నల్లగొండ టౌన్ : గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, వాటికి సహకరించినా పీసీపీఎన్‌డీటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాహుల్ స్పష్టం చేశారు. నల్లగొండలోని ఐఎంఏ హాల్‌లో మంగళవారం ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ప్రైవేట్ వైద్య సంస్థ చెల్లుబాటు అయ్యే నమోదు ధ్రువీకరణతోనే సేవలు అందించాలని, కనీస ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, అగ్నిమాపక భద్రత, చట్టపరమైన రికార్డుల నిర్వహణ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆరోగ్య విద్య విస్తరణాధికారి అంజయ్య గౌడ్ వైద్య చట్టాలు.. వాటిని ఉల్లఘిస్తే జరిగే పరిణామాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ కె.నగేష్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయక్, కార్యదర్శి డాక్టర్ విజయ్‌కుమార్, కె.ప్రవీణ్, వసంతకుమారి, ఎ.పుల్లారావు, పివిఎన్.మూర్తి పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం
మిర్యాలగూడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేస్తామని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక ఓంకార్ స్పష్టం చేశారు. మంగళవారం మిర్యాలగూడలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్య, వైద్యం, ఆర్థిక వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ ప్రజలను విస్మరిస్తోందని విమర్శించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వస్కుల సైదమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, వల్లెపు ఉపేందర్‌రెడ్డి, మోర్తాల చందర్‌రావు, చంద్రశేఖర్, వస్కుల మట్టయ్య, కుంభం సుకన్య, వనం సుధాకర్, గోనె కుమారస్వామి, సంగతి సాంబయ్య, వరికుప్పల వెంకన్న, అరుణ్‌కుమార్, హంసారెడ్డి, తిరుపతి, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ సంస్థాగత కమిటీ నియామకాలు
నల్లగొండ టూటౌన్ : బీజేపీ సంస్థాగత కమిటీలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి ఉదయ్ ప్రతాప్ జీ ఆమోదంతో ప్రకటించారు. జిల్లా కార్యదర్శిగా వరికుప్పల గిరి, సోషల్ మీడియా కన్వీనర్‌గా కర్నాటి శివ, బీజేపీ చండూరు పట్టణ అధ్యక్షుడిగా బత్తురాజు శ్రీహరిని నియమించారు. ఈ సందర్భంగా వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.


