నాలుగు బుట్టల్లో.. | - | Sakshi
Sakshi News home page

నాలుగు బుట్టల్లో..

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

ఏ బుట్టలో.. ఏ చెత్త వేయాలి..

చెత్త

సేకరణ..

ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు కేంద్రం అడుగులు

ముందుగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు

ఆగస్టు నుంచి నూతన విధానం అమలు

మిర్యాలగూడ : పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చేందుకుగాను ఇక నుంచి నాలుగు రకాల బుట్టల్లో చెత్త సేకరించనున్నారు. అన్ని వ్యర్థాలు ఒకేచోట ఉండడం, డంపింగ్‌ యార్డులో తగులబెట్టడంతో విషవాయువులు ప్రబలి సమీప ప్రాంతాల వారు రోగాలబారిన పడే ప్రమాదం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఘన వ్యర్థాల నిర్వహణ –2026కు అనుగుణంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రతి ఇంటికి నాలుగు బుట్టలు అందజేయనున్నారు. చెత్తను తడి, పొడి, శానిటరి వేస్ట్‌, ప్రమాదకరమైన వ్యర్థాలుగా విభజించి నాలుగు బుట్టల్లో సేకరించనున్నారు. జిల్లాలో ఒక కార్పొరేషన్‌, ఏడు మున్సిపాలిటీలు, 869 గ్రామపంచాయతీలో కార్యక్రమం అమలు చేయనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు బుట్టల ప్రతిపాదనతో ప్రజలకు కొంతమేరకు ఉపశమనం కలుగనుంది.

పర్యావరణాన్ని కాపాడేలా..

జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ప్రస్తుతం తడి, పొడి చెత్త కలిపి ఇవ్వడంతో పర్యావరణానికి హాని కలుగుతుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని నాలుగు బుట్టల ద్వారా ఇంటి వద్దనే చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి అందించాల్సి ఉంటుంది. తడి, పొడి చెత్త, శానిటరీ, ఎలక్ట్రికల్‌ వ్యర్థాలు, హానికర చెత్తను సేకరించిన అనంతరం డంపింగ్‌ యార్డుకు తరలించనున్నారు. తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువు, పొడి చెత్తను స్క్రాప్‌ డీలర్లకు అమ్మగా వచ్చిన ఆదాయాన్ని మున్సిపాలిటీ, పంచాయతీకి వినియోగించనున్నారు. శానిటరి వ్యర్థాలను ప్రజలకు దూరంగా డంప్‌ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. హనికరమైన వ్యర్థాలను ప్రత్యేక విధానంలో పారబోయనున్నారు. చెత్త సేకరణకు సైతం మున్సిపాలిటీ వాహనాలు నాలుగు భాగాలుగా చేసి ఆ వ్యర్థాలను అందులో వేసుకుని డంపింగ్‌యార్డుకు తరలిస్తారు.

ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టేందుకు..

పట్టణాల్లో, గ్రామాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించేందుకుగాను ప్రథమంగా ఒక వారం పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆగస్టు మొదటివారంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ప్లాస్టిక్‌ కవర్లను తగ్గించేందుకు ఇంటి నుంచే గన్ని బ్యాగులు, టిఫిన్‌ బాక్స్‌ల ద్వారా మాంసం, టిఫిన్లు తదితర గృహ అవసరాల నిమిత్తం అందులోనే తీసుకురావాలి. గ్రామాల్లో, పట్టణాల్లో జరిగే శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు ప్లేట్లు, గ్లాస్‌లకు బదులుగా స్టీల్‌ ప్లేట్లు జగ్గులు, గ్లాస్‌లు వాడాలని అవగాహన కల్పిస్తారు.

ఆకుపచ్చ బుట్టలో తడి చెత్త అయిన వంటింటి వ్యర్థాలు, కూరగాయల తొక్కలు, ఆహార అవశేషాలు, పూలు, టీ, కాఫీ పొడులు (వీటిని కంపోస్ట్‌ తయారీకి ఉపయోగిస్తారు)

నీలం బుట్టలో పొడి చొత్త అయిన ప్లాస్టిక్‌, కాగితం, గాజు, లోహ పదార్థాలు (వీటిని రీసైక్లింగ్‌కు పంపిస్తారు)

ఎరుపు రంగు బుట్టలో శానిటరి ప్యాడ్లు, డైపర్లు, వైద్య చికిత్సకు వాడిన వస్తువులు, వీటిని పేపర్‌తో కప్పి ఇవ్వాలి. (వీటిని సురక్షితంగా నాశనం చేస్తారు)

నలుపు రంగు బుట్టలో రసాయనాలు, హానికర వ్యర్థాలైన బల్బులు, బ్యాటరీలు, మందులు, ఈ– వేస్ట్‌, పంచ్‌ స్ప్రేలు, పెయింట్లు తదితరాలు (వీటిని ప్రత్యేక విధానంలో పారబోస్తారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement