ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ కోరారు. బుధవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని 6 మున్సిపాలిటీలు, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, నామినేషన్ కేంద్రాల్లో డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికల ఖర్చు బుక్ చేస్తామన్నారు. మున్సిపాలిటీలలో నామినేషన్ వేసే జనరల్ అభ్యర్థులు డిపాజిట్ కింద రూ.2500, ఎస్సీ ఎస్టీలు రూ.1550, కార్పొరేషన్‌లో జనరల్ అభ్యర్థులు రూ.5000, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.2500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కార్పొరేషన్‌లో పోటీ చేసే అభ్యర్థి రూ.1.50 లక్షలు, మున్సిపాలిటీలో పోటీచేసే అభ్యర్థులు రూ.లక్ష వరకు ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు అనుమతి ఉంటుందన్నారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు ఉప సంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించేలోపు ఏ, బీ ఫారాలు సమర్పించాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే పనులు ఎవరు చేయకూడదన్నారు. జిల్లాకు జనరల్ అబ్జర్వర్‌గా రాష్ట్ర ఎస్‌సీఆర్టీ డైరెక్టర్ రమేష్‌ను ఎన్నికల సంఘం నియమించిందన్నారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు ఉంటే జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 18004251442 ఏర్పాటు చేసామన్నారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా నిర్వహించడంలో రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.
బాధ్యతల నిర్వహణలో అలసత్వం వద్దు
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నోడల్ అధికారులకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి నోడల్ అధికారి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని వారి విధులకు సంబంధించి ముందే ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఏ మున్సిపాలిటీలోనూ రీ పోలింగ్‌కు అవకాశం ఇవ్వవద్దని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ రమేష్, మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఆదిత్య, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


