కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య
నల్లగొండలో 45 మంది కార్పొరేటర్ అభ్యర్థులను ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డిని ప్రకటిస్తూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డితో సహా 45 మంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థులను పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఆమోదంతో ప్రకటిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోమటిరెడ్డి పిలుపునిచ్చారు.
రాజకీయ అనుభవం ఇదీ..
బుర్రి చైతన్యరెడ్డి నల్లగొండ మున్సిపాలిటీలో మొన్నటి వరకు కౌన్సిలర్‌గా పనిచేశారు. గతంలో ఆమె రెండుసార్లు నల్లగొండ రామగిరి రామాలయం చైర్మన్‌గా పని చేశారు. ఆమె భర్త బుర్రి శ్రీనివాస్‌రెడ్డి మూడుసార్లు కౌన్సిలర్‌గా, ప్లోర్ లీడర్‌గా, వైస్ చైర్మన్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా, మూడుసార్లు రామగిరి రామాలయం చైర్మన్‌గా పని చేశారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని ముందుగానే మంత్రి కోమటిరెడ్డి చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. దాంతో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీకి దీటుగా 20 మంది కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. బీఆర్‌ఎస్ నుంచి 20 మంది అభ్యర్థులే గెలిచినా ఎక్స్‌అఫిషియో ఓట్లతో చైర్మన్ పీఠం బీఆర్‌ఎస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో అప్పట్లో బీఆర్‌ఎస్ చైర్మన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో బుర్రి శ్రీనివాస్‌రెడ్డి చైర్మన్ అయ్యారు. మంత్రి గతంలో ఇచ్చిన హామీ ప్రకారం బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు.


