నా చిరకాల కోరిక నెరవేరింది
నల్లగొండ : ‘బొట్టుగూడ పాఠశాల నిర్మాణం నా చిరకాల కోరిక. ప్రతి పేదవాడు చదువుకోవాలి. అప్పడే అభివృద్ధి సాధ్యం. అందుకోసమే పేద పిల్లలకు ఒత్తిడి లేని జ్ఞానవంతమైన విద్యను అందించేందుకు వాల్డార్ప్ విద్యను ఆదర్శంగా తీసుకుని సకల హంగులతో పాఠశాల నిర్మించాం’ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని ప్రకాశంబజార్‌లో రూ.8 కోట్లతో కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి పౌండేషన్ ద్వారా నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు పిల్లల కోరిక మేరకు బొట్టుగూడ పాఠశాలను సందర్శించానని.. అద్దె భవనంలో ఆ పాఠశాలకు సొంత భవనం నిర్మించాలని భావించినా.. సాధ్యం కాలేదన్నారు. ప్రస్తుతం తాను రోడ్లు భవనాల శాఖ మంత్రి కావడంతో పట్టణం నడిబొడ్డున ప్రకాశంబజార్‌లో 2005 గజాల్లో భూమిని ముఖ్యమంత్రిని ఒప్పించి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా దేశంలో ఎక్కడా లేనివిధంగా సకల హంగులతో పాఠశాల భవనం నిర్మించామన్నారు. ఇక్కడ చదివే విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేడాలని, ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్తలు కావాలన్నారు. ప్రత్యేక ఎంట్రెన్స్ ద్వారానే పేద పిల్లలకు ఈ పాఠశాలలో అడ్మిషన్లు ఇస్తామన్నారు. ఇక్కడ సంప్రదాయ విద్యతో పాటు పిల్లలు ఆలోచించే విధంగా విద్యను అందించాలనే.. వాల్డార్ప్ విద్యను ఆదర్శంగా తీసుకుని భవనం నిర్మించామన్నారు.
అన్ని విధాలా నల్లగొండ అభివృద్ధి
నల్లగొండను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని రూ.900 కోట్లతో రింగ్ రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఎన్జీ కాలేజీ పనులు ఆగిపోయాయని, ఆ భవనాన్ని పూర్తి చేయడంతో పాటు ప్రభుత్వ బాలికల కళాశాల భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య దొరుకుతుందన్నారు. దీన్ని మోడల్‌గా తీసుకుని ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలన్నారు. అనంతరం బొట్టుగూడ పాఠశాల పూర్వ విద్యార్థులను, భవన నిర్మాణానికి సహకరించిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ హపీజ్‌ఖాన్, కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, డీఈఓ భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్‌రెడ్డి, పాశం రాంరెడ్డి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రతి పేదవాడు చదువుకుంటేనే అభివృద్ధి సాధ్యం
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ ‘కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాల’ భవనం ప్రారంభం
నా చిరకాల కోరిక నెరవేరింది


