ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలి
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధం కావాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం జిల్లాలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేలా ఆర్డీఓలు పర్యవేక్షించాలన్నారు. నామినేషన్లు స్వీకరించేందుకు అవసరమైన పత్రాలు, సామగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ సెంటర్లను మరోసారి పరిశీలించాలని ఆదేశించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అశోక్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి
పాఠశాలల విద్యార్థులంతా 30వ తేదీలోగా పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేలా చూడాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఎంఈఓలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంఈఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో ప్రహరి గోడలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఆయా ఏజెన్సీలకు అప్పగించామన్నారు. పనులను క్షేత్రస్థాయిలో ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత శాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించి నివేదికలను సమర్పించాలన్నారు. అనుమతి లేకుండా స్థానిక సెలవు దినం ఇస్తే సంబంధిత హెచ్‌ఎంను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఈఓ భిక్షపతి, ఈఈలు గిరిధర్, శ్రీధర్‌రెడ్డి, బాలప్రసాద్ ఉన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


