ఎంజీయూకు లా కాలేజీ మంజూరు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి లా కాలేజీ మంజూరైంది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ జీఓ 3ను మంగళవారం విడుదల చేసింది. మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సును 60 మంది విద్యార్థులతో ప్రారంభించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎల్‌ఎల్‌ఎం 2 సంవత్సరాల కోర్సును కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు కవుల మహాసభకు ఎంజీయూ విద్యార్థి
నల్లగొండ టూటౌన్ : ప్రపంచ తెలుగు కవుల మహాసభల(2026)కు ఎంజీయూలో ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కట్రావత్ గణేష్ ఎంపికై నట్లు ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ మారం వెంకటరమణారెడ్డి, సోషల్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ అంజిరెడ్డి మంగళవారం తెలిపారు. మన ఊరు – మన చరిత్ర అనే అంశంపై రాష్ట్రస్థాయిలో 3వ బహుమతి సాధించిన గణేష్ అచ్చంపేట గ్రామాలకు సంబంధించిన తెలుగు సాహిత్య రచనల ఆధారంగా సమగ్రమైన పరిశీలన అనంతరం ఈ మహాసభలకు ఎంపికకావడం గర్వంగా ఉందన్నారు. అంతర్జాతీయ మాతృబాష దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 21, 22 తేదీల్లో విజయవాడలో జరగనున్న ప్రపంచ తెలుగు కవుల మహాసభలకు గణేష్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గణేష్‌కు అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
మోడల్ స్కూల్ తనిఖీ
శాలిగౌరారం : మండలంలోని వల్లాల గ్రామంలో గల ప్రభుత్వ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్‌ను డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో వంటలు, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన విద్యార్థినులతో మాట్లాడారు. వసతులు, మెనూ అమలు, సిబ్బంది పనితీరు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు ఆహార తయారిలో సిబ్బంది తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఆయన వెంట తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ సైదులు, ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సర్పంచ్ భూపతి తిరుపతమ్మ ఉపేందర్ ఉన్నారు.
రసవత్తరంగా కబడ్డీ పోటీలు
పెద్దవూర : మండలంలోని తుంగతుర్తి గ్రామంలో పార్వతి సమేత స్వయంభూ సోమేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. మంగళవారం పరిసర గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కబడ్డీ పోటీలను వీక్షించారు. ఈ పోటీల్లో 15 జట్లు పాల్గొంటున్నాయి.
ఎంజీయూకు లా కాలేజీ మంజూరు
ఎంజీయూకు లా కాలేజీ మంజూరు


