త్రిపురారం: రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా చెప్పి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న ఇద్దరిని త్రిపురారం మండలం డొంకతండావాసులు శనివారం పట్టుకున్నారు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన దుర్గారావు, కాశిదాసు గ్రామాల్లో రేషన్ లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని కొత్త బస్తాల్లో నింపి సన్న బియ్యం పేరుతో తక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. శనివారం వారిద్దరు స్కూటీపై త్రిపురారం మండలం డొంకతండాకు వచ్చి సన్న బియ్యం అంటూ రేషన్ బియ్యం అమ్ముతుండగా.. తండాకు చెందిన ధనావత్ దర్జీ అర క్వింటా బియ్యం రూ.2వేలకు కొనుగోలు చేసింది. విషయం తెలుసుకున్న మరికొందరు తండావాసులు దర్జీ ఇంటి వద్దకు వచ్చి బియ్యం కొనేందుకు బేరం ఆడుతూ.. బస్తాల్లో బియ్యాన్ని పరిశీలించగా అవి రేషన్ బియ్యంగా గుర్తించారు. దీంతో దుర్గారావు, కాశిదాసును నిలదీయగా వారు పారిపోయేందుకు యత్నించారు. వారిని తండావాసులు వెంబడించి దామరచర్ల మండలం మోదుగులతండా వద్ద పట్టుకొని డొంకతండాకు తీసుకొచ్చారు. గతంలోనూ వారు ఇదే తరహాలో బియ్యం అమ్మి మోసం చేసినట్లు తేలింది. నిందితుల నుంచి బియ్యం, స్కూటీని తండావాసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరిని పట్టుకున్న డొంకతండా వాసులు