ఏసీబీ వలలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌

Published Tue, Apr 16 2024 1:55 AM

పట్టుబడిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమేశ్వర్‌ - Sakshi

రూ.18వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

నల్లగొండ టౌన్‌: నల్లగొండ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఊరెల్లి సోమేశ్వర్‌ లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు. ఏసీబీ డీఎస్పీ జగదీష్‌చందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలోని నూకల వెంకట్‌రెడ్డి చారిటబుల్‌ ఆస్పత్రిలో ఫార్మసీ ఏర్పాటు లైసెన్స్‌ కోసం చిట్టెపు సైదిరెడ్డి అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు.

లైసెన్స్‌ ఇవ్వడానికి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమేశ్వర్‌ రూ.20వేలు లంచం డిమాండ్‌ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు సోమవారం నల్లగొండలోని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో రూ.18వేలు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఇవ్వడానికి సైదిరెడ్డి వెళ్లాడు. డబ్బులను తన బ్యాగులో పెట్టాలని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సూచించడంతో రూ.18 వేలను బ్యాగులో పెట్టగానే అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు సోమేశ్వర్‌ను పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని సోమేశ్వర్‌ను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్లారు. సీఐలు వెంకట్‌రావు, రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement