గుట్టలు తవ్వి.. మట్టి దందా!
మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం
మిర్యాలగూడ : మట్టి దందాలో గుట్టలు మాయమవుతున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో గుట్టలను తవ్వి మట్టి విక్రయించి సొమ్ము చేసుకోవడంతో పాటు ఆ భూములను సైతం ఆక్రమిస్తున్నారు. అనుమతులు ఒకచోట తీసుకుని వారికి అనువుగా ఉన్న చోట తవ్వకాలు చేస్తూ మట్టి దందా సాగిస్తున్నారు. జేసీబీలు ఏర్పాటు చేసి టిప్పర్ల ద్వారా రా త్రింబవళ్లు ఆ మట్టిని టిప్పర్ల ద్వారా వెంచర్లకు, ఆంధ్రా ప్రాంతానికి తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నా.. అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి.. జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కాల్వ కట్ట మట్టి సైతం తరలింపు..
నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణంలో భాగంగా ఎడమకాల్వకు నీరందించాలని చేపట్టిన కాల్వ తవ్వకాల మట్టిని ఆ కాల్వ పటిష్టత కోసం ఇరువైపులా మట్టితో నింపి ఉంచారు. అట్టి మట్టిని కొందరు యథేచ్ఛగా తరలిస్తున్నారు. రైల్వే పనుల పేరుతో ఎన్‌ఎస్పీ కాల్వ కట్ట మట్టి, ఆలగడప, అవంతీపురం గ్రామాల్లోని గుట్టలతోపాటు కొత్తగూడెం శివారులోగల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 34, 36, 38లలో 8 ఎకరాల్లో ఉన్న ఏనెను తొలచి మట్టిని తరలిస్తున్నారు.బీ మట్టి దందాతో దామరచర్ల మండలం రాళ్లవాగుతండా వద్ద గతంలో అద్దంకి– నార్కట్‌పల్లి రహదారికి ఆనుకుని ఉన్న గుట్ట కనుమరుగైంది. దానికి వెనుకాలే ఉన్న మరో గుట్టను సైతం ఇప్పుడు సగ భాగానికి పైగా తవ్వేశారు.
మట్టిని కొనుగోలు చేయాల్సి ఉన్నా..
మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని బీబీనగర్– నల్లపాడు, కుక్కడం– విష్ణుపురం వరకు 55కి.మీ మేర రెండవ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా రైల్వే లైన్‌కు అవసరమైన మట్టిని సదరు కాంట్రాక్టర్ కొనుగోలు చేసి తరలించాల్సి ఉంది. కానీ మిర్యాలగూడ మండంలోని రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలో వాటర్ ట్యాంక్‌తండా, మైసమ్మకుంటతండా, ఐలాపురం, చిల్లాపురం, నందిపాడు శివారులో ఎన్‌ఎస్పీ కాల్వకు ఆనుకుని ఉన్న మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. ప్రొక్లెయిన్లతో తవ్వి టిప్పర్లలో నింపి రాత్రి, పగలు తేడా లేకుండా తరలిస్తున్నారు. రూ.కోట్లు విలువల చేసే మట్టి తరలిపోతున్నారని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా.. ఎన్‌ఎస్పీ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
ఫ రైల్వే లైన్, అభివృద్ధి పనుల పేరిట
అక్రమంగా తవ్వకం
ఫ టిప్పర్ల ద్వారా వెంచర్లకు,
ఆంధ్రా ప్రాంతానికి రవాణా
ఫ పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు
రైల్వే పనుల కోసం మట్టి తరలించేందుకు గతంలో అనుమతి ఇచ్చాం. ఆ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 1000టన్నులు మట్టిని తరలించుకునేందుకు ఆయా తహసీల్దార్లు అనుమతి ఇచ్చే అధికారం ఉంది. అక్రమంగా మట్టి తవ్వకాల విషయం మా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
– జాకబ్, మైనింగ్ ఏడీ
గుట్టలు తవ్వి.. మట్టి దందా!


