రేణుకా ఎల్లమ్మకు పూజలు
కనగల్ : మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం అర్చకులు అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అర్చకులు గాదే ఉమామహేశ్వరరావు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : ఎస్పీ
నల్లగొండ : సంక్రాంతి పండుగ ముగయడంతో ఆంధ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణాలు అధికంగా సాగుతున్నాయని.. ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్‌శాఖ సమగ్ర చర్యలు చేపట్టిందని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ముఖ్య కూడళ్లలో 450 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేపట్టామని పేర్కొన్నారు. వాహన రద్దీని డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తూ అవసరమైన చోట్ల వెంటనే ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచామని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
పార్టీల మోసాన్ని
ఓటర్లు గుర్తించాలి
మిర్యాలగూడ : మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలు చేసే మోసాలను ఓటర్లు గుర్తించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే నాయకులను వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఎన్నుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యంతో ప్రలోభాలకు గురిచేసే నాయకులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటర్లను మోసం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పేరిట దరఖాస్తులను స్వీకరించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మిర్యాలగూడలో అధికార పార్టీ దరఖాస్తులను స్వీకరించి ప్రజలను మభ్యపెడుతోందన్నారు. అధికారులు విడుదల చేసిన ఓటరు జాబితా సక్రమంగా లేదని వెంటనే విచారణ జరిపి ఓటరు జాబితాను సవరించి పారదర్శకంగా ఎన్నికలు జరిగే విధంగా చూడాలన్నారు. బలం ఉన్న అన్ని చోట్ల సీపీఎం పోటీ చేస్తుందన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, రాంచంద్రు, సాంబానాయక్, సత్యనారాయణరావు, శ్రీను, వాడపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ‘కూచిపూడి’
భువనగిరి : మండల పరిధిలోని రాయగిరి గ్రామ సమీపంలో గల మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం భువనగిరికి చెందిన కూచిపూడి నాట్య గురువు రమేష్‌బాబు శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. వివిధ అంశాలపై చేసిన నృత్య ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. ఈ కార్య క్రమంలో కళాకారులు శ్లోక, అవికా, దీక్షిత, సిరిశ్రీ, నిత్య, శ్రీమానస తదితరులు పాల్గొన్నారు.
రేణుకా ఎల్లమ్మకు పూజలు
రేణుకా ఎల్లమ్మకు పూజలు


