సడన్‌ బ్రేక్‌ వేసిన డ్రైవర్‌.. బలైన కండక్టర్‌ | Sakshi
Sakshi News home page

సడన్‌ బ్రేక్‌ వేసిన డ్రైవర్‌.. బలైన కండక్టర్‌

Published Mon, Nov 27 2023 1:44 AM

- - Sakshi

భూదాన్‌పోచంపల్లి : ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ సడన్‌బ్రేక్‌ వేయడంతో ఫుట్‌బోర్డు నుంచి జారి కిందపడి కండక్టర్‌ మృతిచెందాడు. భూదాన్‌పోచంపల్లి జలాల్‌పురం గ్రామశివారులో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 50 మందికి పైగా ప్రయాణికులతో ఆదివారం సాయంత్రం 6.20గంటలకు పోచంపల్లి నుంచి సొంత డిపోకు బయలుదేరింది.

బస్సులో బిహార్‌ రాష్ట్రానికి చెందిన కోళ్ల ఫారాల్లో పనిచేసే దాంజిరామ్‌ కూడా జలాల్‌పురం వరకు టికెట్‌ తీసుకున్నాడు.బస్సు జలాల్‌పురం దాటగానే కండక్టర్‌ దేవినేని సత్తిరెడ్డి(59) ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ ముందు ఫుట్‌బోర్డు వైపు వచ్చాడు. ఇదే క్రమంలో దాంజిరామ్‌ తాను దిగాల్సిన స్టేజీ దాటిపోతుందని భావించి వేగంగా కదులుతున్న బస్సులోంచి ఒక్కసారిగా కిందికి దూకాడు.

గమనించిన బస్సుడ్రైవర్‌ పోచంపల్లికి చెందిన మక్తాల సాయి సడెన్‌ బ్రేక్‌ వేయడంతో ముందు ఫుట్‌బోర్డు సమీపంలో ఉన్న కండక్టర్‌ బస్సులోంచి జారి కిందరోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బస్సులోంచి దూకిన దాంజిరామ్‌ తలకు తీవ్రగాయాలు కాగా అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

మృతిచెందిన కండక్టర్‌ సత్తిరెడ్డి హైదరాబాద్‌లోని మన్సురాబాద్‌లో స్థిరనివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. బస్సు డ్రైవర్‌ మక్తాల సాయి ఏడాది క్రితం భూదాన్‌పోచంపల్లి మండల శివారులో బైక్‌ను ఢీకొట్టి వాహనదారుడి మృతికి కారణమయ్యాడు. దాంతో అప్పుడు ఇతనిపై కేసు నమోదయ్యింది. ఈ మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement