అడవికి అండ కరువు! | - | Sakshi
Sakshi News home page

అడవికి అండ కరువు!

Nov 3 2026 1:51 AM | Updated on Nov 3 2026 1:51 AM

● నారాయణపేట జిల్లా భౌగోళిక విస్తీర్ణం 2,366.44 చ.కి.మీ. ఉంటే అడవులు 84.63 చ.కి.మీ. (3.62 శాతం) విస్తరించింది. ఈ జిల్లాను కొన్నేళ్లుగా ఇన్‌చార్జ్‌ డీఎఫ్‌ఓలతోనే నెట్టుకొస్తున్నారు. ఇక్కడ 12 మంది బీట్‌ ఆఫీసర్లకు గాను ఇద్దరే పనిచేస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని అటవీశాఖలో కొన్నేళ్లుగా ఇన్‌చార్జీల వ్యవస్థ కొనసాగుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో అడవుల పర్యవేక్షణ, పరిరక్షణ కరువైంది. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యక్తులు యథేచ్చగా అడవులలో చాలా వరకు విలువైన చెట్లను నరికి అక్రమంగా కలపను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇక వనమహోత్సవంలో భాగంగా ఏటేటా ఆయా ప్రాంతాలలో మొక్కలను విరివిగా నాటినా వాటి సంరక్షణ లేక ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. వాస్తవానికి జిల్లాల పునర్విభజన సమయంలో జోగుళాంబ సర్కిల్‌, నాగర్‌కర్నూల్‌ ఏటీఆర్‌ (అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌) సర్కిల్‌గా విభజించారు. ఈ రెండు చోట్ల ఇన్‌చార్జ్‌ కన్జర్వేటర్లే పనిచేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌కు హైదరాబాద్‌లోని కన్జర్వేటర్‌ ఎస్‌.వి.ఎన్‌.ప్రసాద్‌, జోగుళాంబ సర్కిల్‌కు నల్లగొండ జిల్లా యాదాద్రిలో పనిచేస్తున్న శివాల రాంబాబు కొన్నేళ్లుగా ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. రాంబాబు పరిధిలో వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, గద్వాల జిల్లాలు ఉన్నాయి.

ఇన్‌చార్జీలతోనే అటవీశాఖ నెట్టుకొస్తున్న వైనం

జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేటలో డీఎఫ్‌ఓలు లేరు

నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ రెగ్యులర్‌ అధికారుల నియామకం

చాలా చోట్ల ఎఫ్‌ఆర్‌ఓ, బీఓ, ఎస్‌ఓలను భర్తీ చేయని వైనం

క్షేత్రస్థాయిలో అడవుల పర్యవేక్షణ, పరిరక్షణ కరువైన తీరు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అటవీశాఖలో ఇదీ పరిస్థితి

– మహబూబ్‌నగర్‌ జిల్లా భౌగోళిక విస్తీర్ణం 2,948.66 చ.కి.మీ. ఉంటే అడవులు 270.75 చ.కి.మీ. (9.18 శాతం) విస్తరించింది. సుమారు మూడున్నర నెలల అనంతరం గత సెప్టెంబర్‌ 9న నవీన్‌రెడ్డిని రెగ్యులర్‌ డీఎఫ్‌ఓగా నియమించారు. ఇక్కడ మహబూబ్‌నగర్‌, మహమ్మదాబాద్‌ లలో రేంజ్‌ కార్యాలయాలు ఉన్నాయి. సుమారు ఏడాది పాటు ఇన్‌చార్జీల పాలనలోనే కొనసాగిన మహబూబ్‌నగర్‌కు ఎట్టకేలకు ఈనెల 2న సి.మనోహర్‌ ఎఫ్‌ఆర్‌ఓగా బదిలీపై రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం (నల్లగొండ) నుంచి వచ్చారు. ఈ జిల్లాలో మొత్తం 46 మంది బీట్‌ ఆఫీసర్లకు గాను 18 మాత్రమే పనిచేస్తున్నారు.

పోస్టులు భర్తీ చేయాలని నివేదించాం

కొన్నేళ్లుగా చాలా చోట్ల ఇన్‌చార్జ్‌ అధికారులే ఉండటంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఆశించినస్థాయిలో లేకపోవడం వాస్తవమే. దీంతో ఉన్నవారిపైనే పని భారం పడింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న అటవీ శాఖ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు నివేదించాం.

– శివాల రాంబాబు, కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, జోగుళాంబ సర్కిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement