భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

Nov 3 2026 1:51 AM | Updated on Nov 3 2026 1:51 AM

నాగర్‌కర్నూల్‌/ కందనూలు: మురసు తుపాను ప్రభావంతో జిల్లాలో రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. ప్రజల ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చెన్నయ్య, డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర ఇతర అధికారులతో కలిసి ప్రత్యేకాధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వెబ్‌ఎక్స్‌ ద్వారా కలెక్టర్‌ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో అధికారుల సెలవులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, శిథిల ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రతి మండలంలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి ఆహారం, తాగునీరు, విద్యుత్‌, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రాంతాల్లో రాకపోకలను నిలిపివేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అచ్చంపేట– శ్రీశైలం జాతీయ రహదారిపై రాళ్లు, చెట్లు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నల్లమల ఘాట్‌ రోడ్డులో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రైతులు కోసిన వరి, పత్తి పంటలు వర్షాలకు తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో ఎవరూ బయటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే 24 గంటలు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ సెల్‌ నంబర్‌ 98667 56825కు సమాచారం అందించాలని ఆదేశించారు.

● రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పీఎం రాహత్‌ పథకం ద్వారా సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ సూచించారు. ఈ పథకం కింద బాధితులకు అందుతున్న వైద్య చికిత్స, ఆస్పత్రి స్థాయిలో చేపడుతున్న నమోదు ప్రక్రియ, సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేస్తున్న విధానాన్ని కలెక్టర్‌ సోమవారం జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో పరిశీలించారు. పీఎం రాహత్‌ పథకం కింద బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన బాధితులకు సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ వెంట ఏఎస్పీ వెంకటేశ్వర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సుప్రియ, ఆర్‌ఎంఓ అజీమ్‌, ఎన్‌ఐసీ డీఆర్‌ఎం మధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement