ప్రజా సమస్యలపరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపరిష్కారానికి కృషి

Nov 3 2026 1:51 AM | Updated on Nov 3 2026 1:51 AM

కందనూలు: ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అధికారులు కృషిచేయాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చెన్నయ్యతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలతో 57 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన ప్రతి దరఖాస్తును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి నిబంధనల మేరకు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ పాండు, ఏఓ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీసు గ్రీవెన్స్‌కు 16..

ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌లో బాధితుల నుంచి ఎస్పీ 16 ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో 9 భూమికి సంబంధించి, 1 కుటుంబ గొడవలు, 6 న్యాయం చేయాలని ఫిర్యాదు వచ్చాయి. ఆయా ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ చెప్పారు.

మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

మన్ననూర్‌: రాష్ట్ర గిరిజన సంక్షేమ మినీ గురుకులాల్లో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ సలోని ఛాబ్రా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్‌ రివిజన్‌ పరిధిలోని అమ్రాబాద్‌, బిజినేపల్లి, గండేడ్‌, జడ్చర్ల మినీ గురుకులాల్లో 1, 2, 3, 5 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లను గిరిజన విద్యార్థులతో భర్తీ చేస్తామన్నారు. దరఖాస్తులు ఆయా మండలంలోని మినీ గురుకుల పాఠశాలలో నేరుగా అందజేయాలని, స్థానిక విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, 12న లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక, 13న కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. పూర్తి సమాచారం కోసం ఆయా పాఠశాలలు అమ్రాబాద్‌ (77320 82256), బిజినేపల్లి (63043 53881), గండేడ్‌ (94948 84630), జడ్చర్ల (94910 30260)లను సంప్రదించాలని సూచించారు.

జీవాల పెంపకందారులకు పెన్షన్‌ ఇవ్వాలి

కందనూలు: ప్రభుత్వం గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించి వారికి నెలకు రూ.5 వేల పింఛన్‌ ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్‌ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గొర్రెలు, మేకల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న కాపరులు ఆర్థికంగా వెనకబడి ఇబ్బందులు పడుతున్నారని, వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు. తక్షణమే బీసీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌, కార్యదర్శి శ్యాంసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటినుంచి విద్యుత్‌ వినియోగదారుల దినోత్సవం

అచ్చంపేట: రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు మంగళవారం నుంచి విద్యుత్‌ వినియోగదారుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ నర్సింహారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి నాగర్‌కర్నూల్‌ డివిజన్‌ సర్కిల్‌, సబ్‌ డివిజన్‌ కార్యాలయం, అచ్చంపేట డివిజన్‌, సబ్‌ డివిజన్‌, కొల్లాపూర్‌ సబ్‌ డివిజన్‌, కల్వకుర్తి సబ్‌ డివిజన్‌ కార్యాలయాల్లో కొనసాగుతాయన్నారు. విద్యుత్‌ వినియోగదారుల నుంచి సరఫరాలో అంతరాయాలు, మీటర్‌ సమస్య, విద్యుత్‌ బిల్లులు, కొత్త సర్వీసులు తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే వినియోగదారుల హక్కులు, ఫిర్యాదుల పరిష్కార వేదిక, విద్యుత్‌ అంబుడ్స్‌మన్‌ సేవలు, విద్యుత్‌ భద్రత, పొదుపుపై అవగాహన కల్పిస్తారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement