సర్టిఫికెట్ల వెరిఫికేషన్..
టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. వారు స్థానికంగా ఉంటున్నారా.. వారి కుటుంబ నేపథ్యం ఏమిటి అనే దానిపై ఆరాతీస్తున్నాం. త్వరలోనే ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రస్తుతానికి జిల్లాలోని ఎస్టీ ప్రాంతాలకు సంబంధించి 148 టీచర్లు, 107 ఆయా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. ఇంకా 27 టీచర్లు, 482 ఆయా పోస్టులు ఖాళీగా ఉండగా.. త్వరలోనే మరో నోటిఫికేషన్ వెలువడుతుంది.
– పాండునాయక్,
ఇన్‌చార్జి డీడబ్ల్యూఓ, డీఆర్‌ఓ
అచ్చంపేట: జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు డిమాండ్ బాగా పెరిగింది. గతంలో 10వ తరగతి చదివిన వారిని మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేసేవారు. కానీ, ఈసారి మాత్రం ఇంటర్‌మీడియట్ చదివిన వారిని తీసుకోవాలనే నిబంధనతో నోటిఫికేషన్ ఇచ్చారు. కాగా జిల్లాలో 148 అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు గాను ఏకంగా 2,158 మంది.. 107 హెల్పర్ పోస్టులకు 492 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్క టీచర్ పోస్టుకు సగటున 15 మంది పోటీపడగా.. హెల్పర్ పోస్టులకు ఒక్కో దానిని ఐదుగురు ఆశిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారంతోపాటు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యలో భాగంగా ఆటపాటలతో కూడిన బోధన కొనసాగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలురకాల చర్యలు చేపడుతున్నాయి. అయితే జిల్లాలోని కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు రిటైర్డ్ కావడంతో చాలాకాలంగా ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో పక్క సెంటర్ల టీచర్లకు బాధ్యత అప్పగించినప్పటికీ వాటిపై పూర్తి అజమాయిషీ లేకపోవడంతో ఆయా సెంటర్లలో కనీసం పౌష్టికాహారం అందని పరిస్థితి నెలకొంది.
సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి..
జిల్లావ్యాప్తంగా 175 అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే హెల్పర్ పోస్టులు సైతం 589 కేంద్రాల్లో ఖాళీలు ఉండగా, ఇటీవల 148 టీచర్లు, 107 ఆయా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా 27 టీచర్ పోస్టులు, 482 ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అయితే ఏజెన్సీ, ఎస్టీ ప్రాంతాల్లోనే ఆయా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. మిగతా గ్రామాల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇంటర్‌మీడియట్ చదివిన వారు అర్హులని పేర్కొనడంతో అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన సైతం పూర్తిచేసిన అధికారులు ఇళ్ల పరిశీలన చేస్తున్నారు. దరఖాస్తు చేసిన వారు గ్రామంలోనే ఉంటున్నారా.. లేదా అనే వివరాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
హెల్పర్ పోస్టులకూ తగ్గని డిమాండ్
అంగన్‌వాడీల్లో ఖాళీ భర్తీకి గట్టి పోటీనే
ఇంటర్మీడియట్ అర్హతతో నోటిఫికేషన్
ఈసారి కొత్త నిబంధనలతో ఇంటర్వ్యూలు
ప్రస్తుతానికి ఎస్టీ ప్రాంతాల్లోనేభర్తీకి చర్యలు


