కల్వకుర్తి సీహెచ్‌సీకి కాయకల్ప అవార్డు | - | Sakshi
Sakshi News home page

కల్వకుర్తి సీహెచ్‌సీకి కాయకల్ప అవార్డు

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

కల్వకుర్తి రూరల్‌: అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు ఆస్పత్రిలో పరిశుభ్రతను పాటించినందుకు కల్వకుర్తి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం కాయకల్ప అవార్డు ప్రకటించిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శివరాంనాయక్‌ తెలిపారు. శనివారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మార్చి నెలలో వైద్య, ఆరోగ్యశాఖ బృందం ఆస్పత్రిని సందర్శించి నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న వైద్యసేవలను పరిశీలించిందని.. అనంతరం ఆస్పత్రిని అవార్డుకు ఎంపిక చేశారని వెల్లడించారు. ప్రతిరోజు ఆస్పత్రికి 450 నుంచి 600 మంది రోగులు వస్తున్నారని ఇందులో 400 మందికిపైగా రక్త పరీక్షలు, నెలకు 100కుపైగా కాన్పులు, ఆపరేషన్లు, 58 మంది డయాలసిస్‌ రోగులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. అయితే ఆస్పత్రిలో 6 వైద్యుల ఖాళీలు, 8 నర్సింగ్‌ సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎమ్మెల్యే సహకారంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

‘కొల్లాపూర్‌ నుంచి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తా’

కొల్లాపూర్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నుంచి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తానని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కాలని ఆయన చేపట్టిన పాదయాత్ర శనివారం సాయంత్రం కొల్లాపూర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్‌ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కొల్లాపూర్‌ నుంచి బరిలోకి దిగాలని చాలామంది తనను కోరుతున్నారని.. పోటీచేసే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు తమ స్వార్థం కోసం పార్టీలు మారుతూ అధికారాన్ని అనుభవిస్తున్నారని, కిందిస్థాయిలో ఉండే బీసీలు మాత్రం పార్టీలు మారకుండా అలాగే ఉండిపోతున్నారని, అందుకే బీసీల్లో రాజకీయ ఎదుగుదల లేకుండా పోతోందన్నారు. బీసీలు కూడా అవసరాలకు అనుగుణంగా పార్టీలు మారితేనే అధికారం అనుభవించవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తాను పాదయాత్ర చేపట్టి నెలరోజులు కావొస్తుందని, బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా పాదయాత్ర శనివారం ముగించి మళ్లీ 25వ తేదీ నుంచి పునఃప్రారంభిస్తానని పేర్కొన్నారు.నాయకులు రాజశేఖర్‌, మాసయ్యయాదవ్‌, చంద్రయ్యయాదవ్‌, రాము పాల్గొన్నారు.

నూతన కార్యాలయంలో ఆర్టీఏ సేవలు ప్రారంభం

కందనూలు: జిల్లాకేంద్రంలోని కొల్లాపూర్‌ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించిన జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో శనివారం సేవలు ప్రారంభించినట్లు ఆర్టీఏ ఇమ్రాన్‌ అహ్మద్‌ తెలిపారు. జిల్లా ప్రజలకు రవాణా శాఖ సేవలను మరింత చేరువ చేయడంతోపాటు వాహనదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో నూతన కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. రవాణా శాఖకు సంబంధించిన పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు అవసరమైన సేవలను సులభంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు తదితర సేవల కోసం నూతన కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement