● దిగువకు సాఫీగా నీటి ప్రవాహం.. రైతుల హర్షం
బల్మూర్: మండలంలోని కొత్తపల్లి వద్ద అక్రమంగా ఎత్తిన కేఎల్ఐ కాల్వ షెట్టర్ను అధికారులు మూసివేశారు. కేఎల్ఐ నీటిని డిండి చెరువుకు నీరు మళ్లిస్తున్న తీరుపై శనివారం ‘సాక్షి’లో ‘కేఎల్ఐ నీరు మళ్లింపు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు తుమ్మెన్పేట చెరువు వైపు నీటిని మళ్లించేందుకు ఏర్పాటు చేసిన కాల్వ (షెట్టర్) మార్గాన్ని మూసివేశారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ఈఈ, అధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన హిటాచీ యంత్రాన్ని తొలగించడంతోపాటు షెట్టర్ను మూసివేశారు. దీంతో కేఎల్ఐ కాల్వ నీరు దిగువ ప్రాంతాలకు సాఫీగా ప్రవహించేందుకు మార్గం సుగమమైంది. కాల్వ నీటి మళ్లింపుతో సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన చెందిన దిగువ ప్రాంత రైతులకు అధికారుల చర్యలతో ఊరట లభించింది. సమస్యను వెలుగులోకి తెచ్చి.. పరిష్కారానికి కృషిచేసిన ‘సాక్షి’ కథనంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.


