నాగర్కర్నూల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుందని అదనపు కలెక్టర్ చెన్నయ్య అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక మహిళా సంఘాల భాగస్వామ్యంతో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణమంతా పండుగ శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మ పేర్చి, మహిళలంతా ఒకచోట చేరి ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను జరుపుకోవడం తెలంగాణ ప్రత్యేకత అన్నారు. బతుకమ్మ పండుగ మహిళల్లో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించడంతోపాటు ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని చాటి చెబుతుందని తెలిపారు. తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పే పండుగలను భావితరాలకు పరిచయం చేయడంతోపాటు మహిళలు కుటుంబ బాధ్యతలు, సామాజిక, ఆర్థిక రంగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ పాండు, డీఆర్డీఓ చిన్న ఓబులేసు, ఏపీడీ రాజేశ్వరి, మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


