● అత్యధికంగా కల్వకుర్తిలో
42.4 మి.మీ. వర్షపాతం నమోదు
కల్వకుర్తి టౌన్: జిల్లావ్యాప్తంగా బుధవారం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతం కాగా.. మధ్యాహ్నం నుంచి పలుచోట్ల జల్లులు, మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అత్యధికంగా కల్వకుర్తిలో 42.4 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా అమ్రాబాద్ మండలంలో 3.5 మి.మీ. వర్షం కురిసింది. ఇక తాడూరులో 9.8, లింగాలలో 5.0, వెల్దండలో 4.8, ఊర్కొండలో 4.0 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా సాధారణ జనజీవనానికి స్వల్ప అంతరాయం ఏర్పడింది. సాయంత్రం వరకు ఆకాశం మబ్బులతో ఉండటంతో మరింత వర్షం కురిసే సూచనలు కనిపించాయి. కాగా, వర్షాభావ పరిస్థితులతో ఎండుముఖం పట్టిన పంటలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు జీవం పోసినట్లయ్యిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న తదితర పంట పొలాల్లో తేమ పెరగడానికి వర్షం దోహదపడుతుందని చెబుతున్నారు. మరోవైపు మరికొన్ని ప్రాంతాల్లో సాగు పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో రానున్న రోజుల్లోనూ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది.


