కందనూలు: జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అందరూ సహకరించాలని అదనపు కలెక్టర్ చెన్నయ్య కోరారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 96,911 మంది ఓటర్లకు హియరింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఇంకా నోటీసులు అందుకొని హియరింగ్‌కు హాజరుకావాల్సిన వారు 18,700 మంది ఉన్నారని వెల్లడించారు. నోటీసులు అందుకున్న వారంతా సంబంధిత బీఎల్‌ఓల సమక్షంలో హియరింగ్‌కు హాజరై.. అవసరమైన పత్రాలను సమర్పించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. హియరింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా సంబంధిత ఓటర్లకు సమాచారం అందించి, వారు నిర్ణీత సమయంలో హాజరయ్యేలా చొరవ చూపాలన్నారు. అదే విధంగా మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అదనపు కలెక్టర్ వివరించారు. షెడ్యూల్‌కు అనుగుణంగా అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్హత కలిగిన పట్టభద్రులు నిర్ణీత గడువులోగా ఫారం–18 ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హులైన ఓటర్లు ఎవరూ జాబితాలో తప్పిపోకుండా సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు ఉన్నారు.


