సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ఎల్పీజీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ కోసం వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరా శాఖాధికారి నర్సింహారావు అన్నారు. శనివారం జిల్లాలోని వంగూరు మండలం తుమ్మలపల్లి శివారు యోగి రెస్టారెంట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ హేమ్లానాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2 డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను హోటల్ నిర్వహణ కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు. రెండు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని అత్యవసర వస్తువుల చట్టం–1955 ప్రకారం హోటల్ నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు నర్సింహారావు తెలిపారు. జిల్లాలో ఎక్కడా ఎల్పీజీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో అవసరమైన డొమెస్టిక్ గ్యాస్ స్టాక్ అందుబాటులో ఉందని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.


