‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కందనూలు: జిల్లాలో పదో తరగతి పరీక్షలను అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా మొత్తం 60 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 10,683 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా.. అందులో 5,264 మంది బాలురు, 5,394 మంది బాలికలు ఉన్నారన్నారు. జిల్లాలోని 257 ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, ఇతర మాధ్యమాల పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటిసారిగా ప్రతి పరీక్షకు మధ్య నాలుగు రోజుల వ్యవధి ఉండటం విద్యార్థులకు మంచి అవకాశమని చెప్పారు. ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు అవసరమైన విద్యా మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు. ప్రతి విద్యార్థి పరీక్ష సమయానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు చెప్పారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించబోమని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఎస్పీ శ్రీనివాసులు, డీఈఓ రమేష్‌కుమార్, డీపీఓ శ్రీరాములు, డీఎంహెచ్‌ఓ రవికుమార్, ఏసీ రాజశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


