బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీక సేవాలాల్
కల్వకుర్తి టౌన్: సమాజంలో సమానత్వం, సేవాభావం, నిజాయతీ విలువలను బలపరిచిన మహానుభావుడు సేవాలాల్ మహారాజ్ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తిలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ చారకొండ వెంకటేశ్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. సేవాలాల్ బోధనలు సమాజానికి మార్గదర్శనీయమని.. ఆయన బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడిస్తే సమాజం మరింత సుస్థిరంగా, సమానంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అంతకు ముందు పట్టణంలోని హరిహర టౌన్ షిప్‌లో ఉన్న సేవాలాల్ మహారాజ్ భవనంలో ఎమ్మెల్యే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంప్రదాయ వేషధారణలో బంజారా మహిళలు, యువతు లు నృత్యాలు చేస్తూ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో పీసీబీ మెంబర్ బాలాజీసింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రత్నమాల, వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమా కాంత్ రెడ్డి, తహసీల్దా ర్ ఇబ్రహీం, కాంగ్రెస్ నాయకులు ఆనంద్‌కుమార్, గణేశ్, హన్మానాయక్ పాల్గొన్నారు.


