రెండు రోజుల పాటు కొనసాగిన నిరసనలు..
ఈనెల 18న కుమ్మెర ఆలయంలో దాడి ఘటన చోటుచేసుకోగా, శనివారం శిశువు మృతి చెందింది. శనివారం సాయంత్రం కుటుంబసభ్యులు తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ రోడ్డుపై బైఠాయించి ధర్నాలో పాల్గొన్నారు. ఆదివారం సైతం ఉదయం నుంచి పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన కొనసాగింది. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, బీసీ జేఏసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఎస్సీ, బీసీ కులసంఘాలు, బీఎస్పీ పార్టీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ఈనెల 18న ఫిర్యాదు ఇస్తే ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులను ప్రశ్నించారు. మొత్తం 8 మందిపై ఫిర్యాదు చేస్తే ముగ్గురిని మాత్రమే అదుపులో తీసుకుంటామని చెప్పడం నిందితులను కాపాడటమేనని అన్నారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి బంధువులు అయినందుకే వారిని కాపాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. కుమ్మెర గ్రామంలోని బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి పరామర్శించారు.


