జిల్లాలో 6 సివిల్ సప్లయ్ గోదాంల ఏర్పాటు
లింగాల: జిల్లాలో అనుకూలంగా ఉన్న 6 గోదాంలలో సివిల్ సప్లయ్ బియ్యం నిల్వలను భద్రపరుస్తున్నట్లు జిల్లా అధికారి రాజేందర్ శనివారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 56 రైస్‌మిల్లుల నుంచి సేకరించిన దాదాపు 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలను ఆయా గోదాంలలో ఉంచడం జరుగుతుందని డీఎం తెలిపారు. ఈ క్రమంలోనే లింగాలలోని గోదాంలో సైతం బియ్యం నిల్వలు ఉంచుతామని, ఈ నిల్వలను ప్రతినెలా జిల్లాలోని వివిధ సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్లకు పంపిస్తామని వెల్లడించారు. కాగా లింగాలలోని గోదాంకు రెండు రోజుల నుంచి భారీగా వాహనాలు బియ్యం లోడ్‌లతో చేరుకున్నాయి. ఇక్కడి గోదాంలో 31 వేల బస్తాలు ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. జిల్లాలో వరి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడం, అదే తరహాలో దిగుబడులు కూడా అధికం కావడంతో ప్రభుత్వం గోదాంలను సమకూరుస్తున్నట్లు సమాచారం.


