బాలికల సాధికారతకు కేజీబీవీలు దోహదం
కందనూలు: గ్రామీణ బాలికలకు సమాన విద్యావకాశాలు కల్పించాలనే ప్రభుత్వ దృఢ సంకల్పానికి కేజీబీవీలు బలమైన వేదికలుగా నిలుస్తున్నాయని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. బాలికల సాధికారత, నాణ్యమైన విద్య, ఉన్నత లక్ష్యాల సాధనలో కేజీబీవీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ల్యూమినస్ లీగ్ ఆఫ్ కేజీబీవీలు, ప్రేరణ కార్యక్రమం, ఎస్సెస్సీ– ఇంటర్ విద్యార్థుల సన్మానోత్సవం, పూర్వ విద్యార్థులు, ఉత్తమ ఉద్యోగుల సత్కార కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌తోపాటు డీఈఓ రమేష్‌కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినులు సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. నిరంతర శ్రమ, పట్టుదల, సమయపాలనతోనే ఉన్నత లక్ష్యాలు సాధించవచ్చన్నారు. విద్యార్థి దశలో అలవర్చుకున్న మంచి అలవాట్లు భవిష్యత్‌లో గొప్ప విజయాలకు దారితీస్తాయన్నారు. తల్లిదండ్రులు, గురువుల ఆశలను నెరవేర్చేలా చదువుపై పూర్తి దృషి్‌ాట్సరించాలని సూచించారు. డీఈఓ రమేష్‌కుమార్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రేరణ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇంటర్, పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఫలితాల సాధన దిశగా జిల్లా విద్యా శాఖ చర్యలు చేపడుతోందని, రానున్న ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లాను ఆరో స్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. కేజీబీవీల పర్యవేక్షణాధికారి శోభారాణి మాట్లాడుతూ జిల్లాలోని 20 కేజీబీవీల్లో విద్యార్థినులకు అందిస్తున్న విద్య, వసతి, సహ పాఠ్య కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. కేజీబీవీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న వివిధ స్థాయి ఉద్యోగులను అదనపు కలెక్టర్ ప్రశంసా పత్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, సమగ్ర శిక్ష అభియాన్ ఫైనాన్స్ అధికారి మధుసూదన్‌రెడ్డి, ఎంఈఓలు భాస్కర్‌రెడ్డి, త్యాగరాజు, శ్రీనివాస్‌రెడ్డి, సెక్టోరియల్ అధికారులు వెంకటయ్య, నూరుద్దీన్, కిరణ్‌కుమార్, కేజీబీవీల ఎస్‌ఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.


