‘డి–8’ పనులు పూర్తయ్యేనా?
మేజర్–2 కాల్వకు తరచూ గండి పడుతున్న వైనం
● స్ట్రక్చర్లు, మైనర్ కాల్వల నిర్మాణం పూర్తయితే అడ్డుకట్ట పడే అవకాశం
● 227 స్ట్రక్చర్లకుగాను 106 పూర్తి
● త్వరగా పనులు పూర్తి చేయాలంటున్న రైతులు
– కొల్లాపూర్
●
మా పొలాలకు మేజర్–2 కాల్వ ద్వారా సాగునీరు అందుతోంది. కాల్వ ప్రారంభంలో కేవలం రెండు గూనలు ఏర్పాటు చేశారు. కొన్నిసార్లు నీరు అధికంగా, మరికొన్నిసార్లు తక్కువవగా రావడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బుధవారం కాల్వ ప్రారంభంలో గండి పడింది. దీంతో రెండు గూనలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. గూనలు కాకుండా స్ట్రక్చర్ నిర్మించాలి.
– చంద్రశేఖర్,
మాజీ వైఎస్ ఎంపీపీ, గోపాల్‌పేట
ఏటా పనులు చేపట్టేందుకు కేవలం రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో ముందుకు సాగడం లేదు. మేజర్–2 కాల్వ ప్రారంభంలో బుధవారం గండిపడి రెండు గూనలు కొట్టుకుపోయాయి. సమాచారం అందగానే పరిశీలించి వెంటనే తల్పునూరు వద్ద గేట్‌ను మూసి వేయించాం. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే స్ట్రక్చర్ నిర్మిస్తాం.
– వెంకటరమణమ్మ,
డీఈ, నీటిపారుదలశాఖ
గోపాల్‌పేట: జిల్లా రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 29లో భాగంగా డి–8 కాల్వ నిర్మాణం ప్రారంభించారు. ప్రధాన కాల్వకు 11.6 కిలోమీటరు నుంచి డి–8 కాల్వ ప్రారంభమవుతుంది. సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 34.4 కిలోమీటర్ల పొడవు కాల్వ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎనిమిదేళ్లుగా పనులు కొనసాగుతున్నా నేటికీ పూర్తి కాలేదు. అధికారులు ఏటా కాంట్రాక్టర్‌తో కొంతమేర పనులు చేపడుతున్నారు. ఇప్పటి వరకు మేజర్ కాల్వల పనులు అక్కడక్కడా తప్ప దాదాపు పూర్తయ్యాయి. మైనర్ కాల్వలు 17కుగాను ఇప్పటి వరకు ఆరు మాత్రమే నిర్మించారు. పనులు సరిగా చేపట్టడం లేదని సుమారు ఏడాదిన్నర కిందట టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టు కంపెనీని తొలగించి మరో ఏజెన్సీకి అప్పగించారు. డి–8 కాల్వలో భాగమైన సింగిల్‌లైన్, (ఎస్‌ఎల్‌ఆర్‌బీ), డబుల్‌లైన్ (డీఎల్‌ఆర్‌బీ) వంతెనలు తదితర నిర్మాణాలతో కలిపి మొత్తం 227పైగా స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉండగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 106 వరకు స్ట్రక్చర్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మిగతావి వచ్చే ఏడాది వరకు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వేసవిలోనైనా పూర్తిస్థాయి స్ట్రక్చర్ల నిర్మాణం పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని గోపాల్‌పేట, రేవల్లి, పాన్‌గల్, వనపర్తి మండలాలతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లాలోని కోడేరు మండలంలోని కొన్ని గ్రామాలకు డి–8 కాల్వ ద్వారా సాగునీరు అందుతోంది. ఇందులో ఏడు మేజర్, 17 మైనర్ కాల్వలు నిర్మించాల్సి ఉండగా.. మేజర్ కాల్వల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. అక్కడక్కడా చిన్న చిన్న పనులు మిగిలాయి. మైనర్ కాల్వలు ఇప్పటి వరకు ఆరు మాత్రమే పూర్తికాగా.. మిగతావి నిర్మించాల్సి ఉంది. మేజర్–1 కాల్వ ద్వారా లక్ష్మీదేవిపల్లి, చెన్నారం, మేజర్–2 ద్వారా ఏదుట్ల, గోపాల్‌పేట, మేజర్–3 ద్వారా రేమద్దుల, తిర్మలాపూర్, అప్పాయిపల్లి, వనపర్తి మండలాలకు సాగునీరు అందుతోంది. మేజర్–4 ద్వారా రేమద్దుల, కిష్టాపూర్, కిష్టాపూర్‌తండా, గోప్లాపూర్, దావాజిపల్లి, దత్తాయిపల్లి, చందాపూర్ గ్రామాలకు, మేజర్–6 కాల్వ ద్వారా రాజాపూర్, శాగాపూర్, మాధవరావుపల్లికి సాగునీరు అందుతోంది. వర్షాలు అధికంగా కురిస్తే రాజాపూర్, సింగాయిపల్లికి నీరు అందుతుండగా.. వర్షాలు తక్కువగా కురిస్తే ఆయా గ్రామాలకు సాగునీరు అందదు. అధికారులు కాల్వల బాగుకు తగిన చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.
● గోపాల్‌పేట నుంచి ఏదుట్ల వెళ్లే దారిలో ఉన్న మేజర్–2 కాల్వకు ప్రారంభంలో బుధవారం బుధవారం గండి పడింది. రైతులు నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో డీఈ వెంకటరమణమ్మ పరిశీలించారు.
‘డి–8’ పనులు పూర్తయ్యేనా?
‘డి–8’ పనులు పూర్తయ్యేనా?


