గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
కందనూలు: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కల్వకుర్తి డివిజన్‌లోని 116 గ్రామాలకు చెందిన సర్పంచ్‌లకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన రెండో విడత శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా ప్రభుత్వం మహిళా శక్తికి మరింత బలాన్ని ఇచ్చిందన్నారు.
● మహిళా సర్పంచులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో నిధులు, విధులను పారదర్శకంగా నిర్వహిస్తూ.. సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ లోటుపాట్లను అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. గ్రామ పాలనలో కుటుంబ సభ్యుల జోక్యానికి అవకాశం ఇవ్వకుండా, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేయాలని కోరారు. పన్నులు, ఇతర వనరుల ద్వారా సమకూరే ఆదాయం దృష్టి కేంద్రీకరించాలని, ఆదాయం సమకూరితే ప్రజోపయోగ పనులు చేపట్టి మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపర్చాలన్నారు. రెండో విడతలో కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, చారకొండ, వంగూరు మండలాలకు చెందిన సర్పంచ్‌లకు ఐదు రోజులపాటు శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. పంచాయతీరాజ్ చట్టం, గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలు విధానం, ఆర్థిక నిర్వహణ, సామాజిక బాధ్యతలు, పారదర్శక పాలన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు డీపీఓ శ్రీరాములు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్, డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు, నూతన సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


