దేశంలోనే అతిపెద్ద సేవాలాల్ విగ్రహం
● బంజారాల సంస్కృతి, సంప్రదాయాలుప్రతిబింబించేలా ఏర్పాటు
● సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్‌రాజ్
అచ్చంపేట: బంజారాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే గిరిజనుల ఆరాధ దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహం నిర్మిస్తామని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి కేఎస్ శ్రీనివాస్‌రాజ్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మద్దిమడుగులో సంత్ సేవాలాల్ విగ్రహ స్థాపనకు ప్రతిపాదించిన 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించి.. స్థానిక అధికారులతో అవసరమైన మౌలిక వసతులపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పది నెలల్లో పక్కా ప్రణాళికలు రూపొందించి విగ్రహ ఏర్పాటు చేస్తామని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందన్నారు. దేశంలోనే అతిపెద్ద విగ్రహం నిర్మించాలనే సంకల్పంతో సీఎం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ప్రతిపాదిత స్థలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండటంతో భౌగోళిక పరిస్థితులు, భద్రతా అంశాలు, రవాణా సౌకర్యం, ప్రజలకు మెరుగైన వసతులు వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికలు రూపొందించి సీఎంకు సమర్పిస్తామన్నారు.
● కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు ముందుకు తీసుకుపోయే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుందన్నారు. విగ్రహ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సమన్వయం చేస్తూ రానున్న ఏడా దిలోగా పూర్తిచేసేలా కృషిచేస్తామని వెల్లడించారు.
● గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ విగ్రహాన్ని నల్లమలలో ఏర్పాటు చేయడం గిరిజనుల అదృష్టంగా భావిస్తున్నామని ఎంపీ బల్‌రాంనాయక్ అన్నారు. నల్లమలలో ఏర్పాటు చేసే విగ్రహం దేశ ప్రతిష్టను ప్రతిబింబించేలా ఉంటుందన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ అన్నారు. మద్దిమడుగులో ఏర్పాటు చేసే సంత్ సేవాలాల్ విగ్రహం దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆధ్యాత్మికతకు నిలయమైన నల్లమలలో ఏర్పాటు చేయడం వల్ల మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవస్థానం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్‌నాయక్, ఆలిండియా బంజారాల నాయకుడు రామ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.


