‘ప్రణాళికాబద్ధంగా మున్సిపాలిటీ అభివృద్ధి’
కొల్లాపూర్: మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన కొల్లాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ షేక్ రహీంపాషాతో కలిసి పట్టణంలో పర్యటించారు. మున్సిపాలిటీకి తాగునీటిని సరఫరా చేసే సింగోటం ట్యాంకును మంత్రి పరిశీలించారు. పట్టణంలో తరచూ తాగునీటి సమస్యలు ఏర్పడడానికి గల కారణాలపై అధికారులతో చర్చించారు. నీటి లీకేజీలు లేకుండా వెంటనే పనులు చేపట్టాలని, ఇందుకోసం తన నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తానని చెప్పారు. సింగోటం ట్యాంకు నుంచి కాకుండా ర్యాపిడ్ ఫోర్స్ ద్వారా కొల్లాపూర్‌కు తాగునీటిని సరఫరా చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. పట్టణంలోని వెటర్నరీ ఆస్పత్రిలో నిరుపయోగంగా ఉన్న భవనాన్ని మంత్రి పరిశీలించి.. ఆ పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పూర్తయితే అందులో నిరుద్యోగులకు ఉపయోగపడేలా డాటా సెంటర్ ఏర్పాటు అంశాన్ని ఆలోచించాలన్నారు. ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులకు చెప్పారు. మంత్రి వెంట కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్లు ఉన్నారు.


