వైద్య శిబిరాలను వినియోగించుకోండి
అమ్రాబాద్: జిల్లా వైద్య శాఖ, ఐటీడీఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను చెంచులు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ రవికుమార్ అన్నారు. మన్ననూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని మొల్కమామిడి, మాచారంకాలనీలో నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాలను సందర్శించి ఆయన పరిశీలించారు. శిబిరంలో చెంచులకు అందుతున్న నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెంచుల ఆరోగ్య సమస్యల కోసమే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎవరికై నా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వైద్య సిబ్బందిని సంప్రదించి ప్రభుత్వం నుంచి ఉచితంగా అందిస్తున్న సేవలను పొందాలని సూచించారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం ఉంటే పరీక్షలు చేయించుకొని చికిత్స చేయించుకోవాలన్నారు. రక్తపోటు మధుమేహం నిర్ధారణ పరీక్షలు చేయించుకొని పూర్తిస్థాయిలో చికిత్స పొందాలని చెప్పారు. కార్యక్రమంలో మన్ననూర్ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుధాకర్, మోహన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


