చివరి దాకా సస్పెన్స్‌.. | - | Sakshi
Sakshi News home page

చివరి దాకా సస్పెన్స్‌..

Feb 17 2026 8:43 AM | Updated on Feb 17 2026 8:43 AM

చివరి దాకా సస్పెన్స్‌..

చివరి దాకా సస్పెన్స్‌..

చివరి దాకా సస్పెన్స్‌..

కుదిరిన ఒప్పందం..

మూడింట బీసీలే చైర్మన్లు..

నాగర్‌కర్నూల్‌ చైర్మన్‌గా తీగల సునేంద్ర, కల్వకుర్తిలో రత్నమాల

కొల్లాపూర్‌లో చైర్‌పర్సన్‌గా

అనూహ్యంగా రెడ్డి జ్యోతికి చాన్స్‌

నిరాశతో వెనుదిరిగిన ఆశావహులు

కల్వకుర్తి, కొల్లాపూర్‌లో వైస్‌ చైర్మన్లుగా మైనార్టీలకు అవకాశం

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా తీగల సునేంద్ర, వైస్‌చైర్మన్‌గా బాదం రమేశ్‌ ఎన్నికయ్యారు. కల్వకుర్తి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా భృంగి రత్నమాల, వైస్‌చైర్మన్‌గా షానవాజ్‌ఖాన్‌, కొల్లాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా రెడ్డి జ్యోతి, వైస్‌ చైర్మన్‌గా షేక్‌ రహీంపాషా ఎన్నికయ్యారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ అత్యధిక సంఖ్యలో వార్డులను సొంతం చేసుకోగా.. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సైతం ఎలాంటి నామినేషన్లు లేకుండా అన్నిచోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కాంగ్రెస్‌ అభ్యర్థులతో నేతలు క్యాంపులను నిర్వహించారు. సోమవారం చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్‌ కార్యాలయాలకు ప్రత్యేక బస్సుల్లో కాంగ్రెస్‌ సభ్యులు చేరుకున్నారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌ మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గ సభ్యులు, చైర్మన్‌, వైస్‌చైర్మన్లతో ఆర్డీఓలు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహించి ఎన్నికై న వారి పేర్లను ప్రకటించారు.

కొల్లాపూర్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ పదవి కోసం కాంగ్రెస్‌ నుంచి గెలిచిన అభ్యర్థుల నుంచి తీవ్రమైన పోటీ కొనసాగింది. చైర్‌పర్సన్‌ ఎన్నికపై చివరి వరకు సస్పెన్స్‌ కొనసాగింది. ఇక్కడ చైర్‌పర్సన్‌ పదవి కోసం పట్టుబట్టిన వారికి కాకుండా మరొకరికి అవకాశం దక్కింది. చైర్‌పర్సన్‌ కోసం అనూష, శ్రీదేవి, రమ్యకుమారి పోటీపడగా.. వీరెవరికి కాకుండా అనూహ్య రీతిలో రెడ్డి జ్యోతికి అవకాశం కల్పించారు. ఈ కుటుంబం మొదటి నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావుకు విధేయులుగా ఉంటున్నారు. తీవ్ర పోటీ నేపథ్యంలో చివరికి జ్యోతికే చైర్‌పర్సన్‌గా పట్టం కట్టారు. చైర్‌పర్సన్‌ పదవి కోసం గంపెడాశలతో ఎదురుచూసిన ఆశావహులు కౌన్సిల్‌ సమావేశం నుంచి నిరాశతో వెనుదిరిగారు.

కల్వకుర్తి మున్సిపాలిటీలో చైర్మన్‌ పదవి ముందస్తుగానే ఖరారు కాగా.. వైస్‌ చైర్మన్‌ పదవి కోసం మాత్రం చివరి వరకు ఊగిసలాట కొనసాగింది. వైస్‌ చైర్మన్‌ కోసం పార్టీలోని ఇరువర్గాలు పట్టుపట్టడంతో తెగని పంచాయతీగా మారింది. ఈ క్రమంలో చైర్మన్‌ ఎన్నిక సమయానికి ఇరువర్గాల మధ్య ఒప్పందానికి వచ్చినట్టు తెలిసింది. వైస్‌ చైర్మన్‌ పదవిని మొదటి రెండేళ్లపాటు ఒకరు, మిగతా మూడేళ్ల పాటు మరొకరు చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.

జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు చైర్మన్‌ స్థానాల్లో బీసీలే ఎన్నికయ్యారు. కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్‌ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా.. ఈ స్థానంలో బీసీ వర్గానికి చెందిన రత్నమాలకు అవకాశం దక్కింది. నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ బీసీ జనరల్‌కు కేటాయించగా తీగల సునేంద్ర ఎన్నికయ్యారు. కొల్లాపూర్‌ మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వ్‌ కాగా బోయ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి జ్యోతి ఎన్నికయ్యారు. దీంతో మూడు మున్సిపాలిటీల్లోనూ చైర్మన్‌ స్థానాల్లో బీసీలకే అవకాశం దక్కింది. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో వైస్‌చైర్మన్లుగా మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తులకు అవకాశం దక్కింది. కొల్లాపూర్‌ మున్సిపాలిటీ వైస్‌చైర్మన్‌గా రహీంపాషా, కల్వకుర్తి మున్సిపాలిటీ వైస్‌చైర్మన్‌గా షానవాజ్‌ఖాన్‌ ఎన్నికయ్యారు. నాగర్‌కర్నూల్‌లో వైశ్య సామాజిక వర్గానికి చెందిన బాదం రమేశ్‌కు వైస్‌చైర్మన్‌గా అవకాశం దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement