ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం
కందనూలు: జిల్లావ్యాప్తంగా సోమవారం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి. మొదటిరోజు జిల్లాలోని 33 కేంద్రాల్లో పరీక్ష జరగగా.. 3,148 మంది విద్యార్థులకు గాను 3,001 మంది హాజరవగా.. 147 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణ
కల్వకుర్తి టౌన్: పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీపాద శార్వాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థికి పీజీలో 55 శాతం మార్కులతోపాటు పీహెచ్‌డీ, నెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను బుధవారంలోగా కళాశాలలో అందజేయాలని సూచించారు.
ఆకట్టుకున్న ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్
కందనూలు: పనోరమ ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్–2026లో భాగంగా ‘ది ఎలిమెంట్ ఆఫ్ ఎర్త్’ అనే థీమ్‌తో జూమ్ వేదికగా నిర్వహించిన ఆన్‌లైన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఆకట్టుకుంది. శూన్యం, బిగ్ బ్యాంగ్ పుస్తక రచనలతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ప్రైవేటు టీచింగ్ ఫ్యాకల్టీ, కవి, రచయిత ఫిజిక్స్ అరుణ్‌కుమార్ రైటర్స్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కొనసాగిన కార్యక్రమంలో ఇండియా ప్రతినిధిగా పాల్గొని కవితాగానం చేశారు. ఈ సందర్భంగా ఫిజిక్స్ అరుణ్ ‘అవని.. ప్రేమ కిరణాల కవనమై..!’ శీర్షికతో చదివిన కవిత ద్వారా గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితో విశ్వమంతా ప్రేమ మయమై, యుద్ధాలు లేని ప్రపంచంలో పర్యావరణ హితమై అందరూ సుఖశాంతులతో జీవించాలని, ప్లాస్టిక్ వినియోగ రహిత అవనిపై పచ్చని చెట్ల చిరునవ్వుల వెలుగుల మధ్య పుడమిపై పున్నమి వెన్నెల పూయాలని, లౌకిక తాత్విక స్ఫూర్తితో వసుదైక కుటుంబమై మనమంతా మెలగాలని.. తన అక్షరాలతో ప్రపంచానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ ఇరానీడౌరా కవడియా, సమన్వయకర్త రామకృష్ణ, రామ్మోహన్‌రావు, లక్ష్మీనారాయణ్ కొల్లి, వినోద్ కుత్తుం, మిరప మహేష్, సుధా మురళి, శ్రీ వశిష్ట సోమేపల్లి, మందారపు హైమావతి ప్రతినిధులుగా పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొనడంపై వివిధ రంగాల ప్రముఖులు, విద్యార్థులు, మిత్రులు సోషల్ మీడియా వేదికగా అరుణ్‌కు అభినందనలు తెలిపారు.


