మంచాలకట్టను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
పెంట్లవెల్లి: కృష్ణానది తీరంలోని మంచాలకట్ట గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా, పర్యాటకులకు కనువిందు చేసే విధంగా ఉన్న ఈ గ్రామాన్ని నిత్యం పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఈ మేరకు సోమవారం మంత్రి గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి పనుల నిమిత్తం రూ.1.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో కృష్ణానది తీరాన కాటేజీలు ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ అధికారులకు ఫోన్‌లో సూచించారు. అలాగే గ్రామాన్ని సందర్శించి ప్రతిపాదనలు రూ పొందించాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామానికి నూతనంగా 17 ఇళ్లను మంజూరు చేశారు. గ్రామంలో ఎవరూ పూరి గుడిసెలో నివశించవద్దని, కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుందని చెప్పారు. అనంతరం మంచాలకట్ట గ్రామంలో గతకొద్ది రోజుల క్రితం మరణించిన రాగుల వెంకటస్వామి, రాగుల మశమ్మల కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శివయ్య, నిరంజన్, బాలరాజు, గోవింద్, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.


