పంట మార్పిడితో అధిక లాభాలు
బిజినేపల్లి: పంటల మార్పిడి విధానంతో అధిక లాభాలు ఉంటాయని.. రైతులు ఒకే రకమైన పంటను కాకుండా లాభదాయక పంటల సాగుపై దృష్టిసారించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కిసాన్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం మార్కెట్‌లో పప్పుదినుసులు, నూనెగింజల పంటలకు అధిక డిమాండ్ ఉందన్నారు. యాసంగి సీజన్‌లో పంట మార్పిడి విధానం పాటించడంతో పాటు పప్పుదినుసులు, నూనెగింజల పంటలు సాగుచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి, అన్నివిధాలా అండగా నిలుస్తోందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద రైతులకు పలు రకాల యంత్రాలు, స్ప్రింక్లర్లు, బిందుసేద్యం పరికరాలతో పాటు విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందిస్తోందన్నారు. రైతులకు ప్రభుత్వం అందించే అన్నిరకాల సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.


