సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
నాగర్‌కర్నూల్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దుచేసి.. కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా తెచ్చిన వీబీజీ రామ్‌జీ బిల్లుతో పాటు జాతీయ విత్తన బిల్లును వెంటనే రద్దు చేయాలన్నారు. కార్మిక, కర్షక హక్కుల సాధన కోసం నిర్వహించే సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు ఆర్.శ్రీనివాసులు మారెడు శివశంకర్, పోదిల రామయ్య, శ్రీనివాసులు, గోర్ల సత్యం, సిద్దేశ్, విజయ్ ఉన్నారు.
ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం
చారకొండ: మండలంలోని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజల సమస్యపై ప్రభుత్వం స్పందించి ముంపు నుంచి మినహాయించే వరకు పోరాడతామని నిర్వాసితులు పేర్కొన్నారు. ఎర్రవల్లి లో నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 58 రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రా మాలను ముంపు నుంచి కాపాడాలని రిలే దీక్షలు చేపట్టిన ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
నేడు లక్ష తులసి అర్చన
బిజినేపల్లి: మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం లక్ష తులసి అర్చన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీవీ శేషారెడ్డి దంపతుల కై ంకర్యంలో స్వామివారికి లక్ష తులసి అర్చన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు.
వెంకటేశ.. నమోస్తుతే...
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం దేవస్థానం సమీపంలోని కోటకదిరలో ఉన్న ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్ ఇంటి నుంచి స్వామి ఉత్సవమూర్తిని మన్యంకొండ గుట్టపైకి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. కోలాటాలు, భజనలతో కోటకదిర గ్రామం భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. ముందుగా స్వామివారిని వివిధ బంగారు ఆభరణాలతో అలంకరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం, నివేదన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన దాసంగాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారికి గరుడవాహన సేవ నిర్వహించారు. గురువారం స్వామివారికి హంస వాహనసేవ నిర్వహించనున్నారు.
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి


