
మళ్లీ అదే తప్పు!
అడ్డగోలుగా అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు కాంట్రాక్టుల అప్పగింత
● ఈఎస్‌ఐ, పీఎఫ్‌లేక ఉద్యోగుల ఇబ్బందులు
● బ్యాంక్ గ్యారంటీలు తీసుకుని అగ్రిమెంట్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు
● నిబంధనలు పట్టించుకోని
అధికారులు
● ఏజెన్సీలపై ఎన్నాళ్లీ ఉదాసీనత?
నాగర్‌కర్నూల్: అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతో ఏజెన్సీలు ఆటలాడుతున్నాయి. ఏజెన్సీలకు అధికారులు కూడా సహకరిస్తుండడంతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. గతంలో కొన్ని ఏజెన్సీలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి పీఎఫ్, ఈఎస్‌ఐని చెల్లించడంలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. దీనికి తోడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొన్నిసార్లు వేతనాలు సరిగా ఇవ్వకపోవడంతో పాటు కోతలు విధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారికి సంబంధించి ఎలాంటి బ్యాంక్ గ్యారంటీలు లేకపోవడంతో ఏజెన్సీల నిర్వాహకులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. అక్రమాలకు పాల్పడ్డ వారికి కాంట్రాక్టు రద్దు చేసి మరొకరికి ఇచ్చారే తప్పా.. వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఒక వేళ కొంత నగదును బ్యాంకులో డిపాజిట్ చేసి బ్యాంకు గ్యారంటీ ఇస్తే ఏజెన్సీలకు కొంత భయం ఉండే అవకాశం ఉంటుంది. ఏజెన్సీలు మారుతున్నాయే తప్పా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి భరోసా ఉండడం లేదు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్..
జిల్లాలో ఎంప్యానెల్ ఏజెన్సీలు 26 ఉండగా.. అందులో దాదాపుగా 700 నుంచి 800 వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ ఏజెన్సీలకు సంబంధించి ఏ శాఖలోనైనా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను అప్పగించే సమయంలో బ్యాంక్ పీఎఫ్, ఈఎస్‌ఐలకు సంబంధించి మూడు నెలలకు సరిపడా డబ్బులకు సంబంధించి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే సదరు ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడినా ఆ డబ్బును అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయవచ్చు. బ్యాంక్ గ్యారెంటీకి ఇచ్చిన డబ్బులు ఖాతాలోంచి తీయడానికి వీలుండదు. కాంట్రాక్ట్ ముగిసిన తరువాత సంబంధిత అధికారి ఎన్‌ఓసీ ఇస్తేనే బ్యాంక్ నుంచి సదరు డబ్బులు ఏజెన్సీకు సంబంధించిన వారు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్‌లోనూ బ్యాంక్ గ్యారంటీ తీసుకొని ఏజెన్సీలకు కాంట్రాక్టులు ఇవ్వాలని నిబంధనలే స్పష్టంగా ఉన్నా.. ఏ అధికారి కూడా పాటించడం లేదు.
పరిశీలిస్తాం..
ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి కొన్ని పోస్టులను ఒక ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి అగ్రిమెంట్ చేసిన మాట వాస్తవమే. నిబంధనలకు సంబంధించి ఒకసారి పరిశీలన చేస్తాం. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.
– రవికుమార్,
ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌ఓ

మళ్లీ అదే తప్పు!