
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించండి
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి 13 ఫిర్యాదులు రాగా.. ఇందులో 5 భూతగాదా, 4 భార్యాభర్తల మధ్య గొడవ, 2 ఇరువర్గాల గొడవ, 2 ఇతర ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి
జిల్లాలో ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు పోలీసుశాఖ నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. గణేష్ మండపాల కోసం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తామన్నారు. మండపాల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 24గంటల పాటు ఇద్దరు వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణేష్ మండపంలో మద్యపానం, జూదం, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు.