
చైర్మన్, కమిషనర్ పోకడలపై గుస్సా..
అచ్చంపేట: స్థానిక మున్సిపల్ సర్వసభ సమావేశం సాయంత్రం 4గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా.. అధికారులు ఆలస్యం చేయడంపై అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లు అలకబూనారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వచ్చిన తర్వాతే సమావేశం ప్రారంభిస్తామని అధికారులు చెప్పడంతో కొంతమంది కౌన్సిలర్లు ఒకానొక సమయంలో బయటికి వెళ్లిపోయారు. మున్సిపల్ లుకలుకలు బయటపడుతాయని బుజ్జగించడంతో ఎమ్మెల్యే వచ్చే సమయంలో తిరిగి కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 5.45గంటలకు ప్రారంభమైన సమావేశానికి విలేకరులను సైతం అనుమతించలేదు. సమావేశం ముగిసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మున్సిపాలిటీలో అవినీతి బాగోతాలు బయటపడుతాయనే ఆందోళనతోనే రహస్య సమావేశం నిర్వహిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. కొన్ని రోజులుగా చైర్మన్, కమిషనర్ వైఖరిపై వైస్ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు బాహాటంగా మున్సిపల్ గ్రూపులో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఆర్టీసీ బస్టాండు ముందు స్టీట్ వెండర్స్‌ను తొలగించే విషయంలో వైస్ చైర్మన్‌తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్ తీరును దుయ్యబట్టారు.
మున్సిపాలిటీలో ప్రొటోకాల్ రగడ
మున్సిపాలిటీలో ప్రోటోకాల్ రగడ సాగుతోంది. వార్డుల్లో అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నా.. స్థానిక కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా చైర్మన్, కమిషనర్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలలో మున్సిపల్ మీడియా వాట్సాప్ గ్రూప్‌లో కొందరు కౌన్సిలర్లు ప్రోటోకాల్ రగడపై పోటాపోటీగా విమర్శలు గుప్పించారు. గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు తమను గౌరవించేవారని, తాము రెండు సార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డామని, కొందరు పైసలతో పదవులను కొనుకొని వ్యాపారంలా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. నియంత పోకడ మానకపోతే త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.