
సమష్టి పోరాటాలకు సిద్ధం కావాలి
అచ్చంపేట రూరల్: రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సమష్టి పోరాటాలకు సిద్ధం కావాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం అచ్చంపేటలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన గిరిజన సంఘం జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నిరంగాల్లో వెనకబడిన గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐదు మైదాన, ఏజెన్సీల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ అమలుచేయాలన్నారు. గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు 12శాతం పెంచాలని.. గిరిజన కార్పొరేషన్ ఏర్పాటుచేసి రూ. 5వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు దేశ్యానాయక్, శంకర్ నాయక్, అశోక్, లక్పతి, దశరథం, హరీశ్‌నాయక్, వాల్యా, రమేశ్, మల్లేశ్, వెంకటేశ్, శ్రీను, నరేందర్, అనిత ఉన్నారు.
ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం
కల్వకుర్తి రూరల్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామని టీజీఈజేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు. ఆదివారం కల్వకుర్తిలోని టీఎన్‌జీఓ భవన్‌లో డివిజన్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడిగా సురేష్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా రాజేష్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, నూతన పెన్షన్ విధానంపై ఆందోళన చేస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఉద్యమ కార్యాచరణలో భాగంగా పబ్లిక్ గార్డెన్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటామన్నారు. సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా కో చైర్మన్ సురేందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనర్సింహారావు, నెహ్రూ ప్రసాద్, బాలరాజు, కృష్ణారెడ్డి, రాజేందర్‌రెడ్డి, జమీల్ అహ్మద్, ప్రమోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వాలీబాల్ నూతన
కార్యవర్గం ఎన్నిక
కందనూలు: వాలీబాల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల (పైకా భవన్)లో ఆదివారం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి పోచప్ప ప్రకటించారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా వంకేశ్వరం నిరంజన్, ఉపాధ్యక్షుడిగా ఊరుకొండ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా పశుల వెంకటేష్, సహాయ కార్యదర్శిగా వీరప్ప ఎన్నికయ్యారు. కార్యక్రమంలో హనీఫ్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
దసరా ఉత్సవాలను
వైభవంగా నిర్వహిద్దాం
కల్వకుర్తి రూరల్: దసరా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిద్దామని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం ట్రస్టు చైర్మన్ జూలూరు రమేష్‌బాబు అన్నారు. ఆదివారం ఆలయ ఆవరణలో నిర్వహించిన ఉత్సవ కమిటీ సమావేశంలో కమిటీ అధ్యక్షుడిగా గంధి రవి, 2026 సంవత్సర అధ్యక్షుడిగా కల్మిచర్ల గోపాల్‌ను ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపించామని, ఈసారి కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని పేర్కొన్నారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ మాట్లాడుతూ వినాయక చవితి, దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకొందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు శేఖర్, వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ కల్వ మనోహర్, డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిచాని బాలకృష్ణ, నాయకులు కల్మచర్ల రమేష్, శివ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

సమష్టి పోరాటాలకు సిద్ధం కావాలి