
విద్యార్థులకు మెరుగైన విద్య బోధించాలి
వెల్దండ: విద్యార్థులకు మెరుగైన బోధన చేయడంతోపాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. ఆదివారం ఉదయం ఆయన వెల్దండలోని కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసి.. పాఠశాలలోని స్టోర్ రూం, వంట గదులను కలియదిరిగారు. విద్యార్థులకు వడ్డించిన ఆహారాన్ని పరిశీలించారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం నూతన మెనూ ప్రకారం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అలాగే స్థానిక మోడల్ హైస్కూల్, ఇంటర్మీడియట్ హాస్టల్‌ను తనిఖీ చేసి మాట్లాడారు. విద్యా బోధన, భోజన సదుపాయం, ఇతర మౌలిక వసతులు ఎలా ఉన్నాయి.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. బాలికలు విద్యతోపాటు అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టెస్టు బుక్ మేనేజర్ నర్సింహులు, మోడల్ హాస్టల్ ఇన్‌చార్జ్ మంజుల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.