
ప్రతి పల్లెకు రవాణా సౌకర్యం
కల్వకుర్తి రూరల్/ వెల్దండ: నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం రహదారుల నిర్మాణం చేపట్టడంతోపాటు అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కల్వకుర్తి, వెల్దండ మండలాల్లోని యంగంపల్లి నుంచి జిల్లెల్ల గ్రామానికి రూ.2 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, అలాగే జీడిపల్లి తండా, పెద్దాపూర్‌లో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, వెంకటాపూర్ తండా, కంటోనిపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారుల అభివృద్ధితో గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తాయన్నారు. కాంట్రాక్టర్లు పనులను నాణ్యతగా చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పాడిరైతుల సౌకర్యార్థం పశువైద్యశాలను మంజూరు చేస్తామన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉండడంతో వారి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీసింగ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి, నాయకులు భూపతిరెడ్డి, సంజీవ్‌కుమార్, కిషోర్‌రెడ్డి, డీఎల్‌పీఓ నర్సిరెడ్డి, పీఆర్ డీఈఈ బస్వరాజు, వెల్దండ తహసీల్దార్ కార్తీక్‌కుమార్, ఎంపీడీఓ సత్యపాల్‌రెడ్డి పాల్గొన్నారు.